1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 జూన్ 2024 (19:51 IST)

ఆ వార్త విన్నాకే రామోజీ రావు పరమపదించారు.. పవన్ కల్యాణ్ (video)

PawanKalyan
PawanKalyan
ఈనాడు, రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు, మీడియా దిగ్గజం రామోజీరావు సంస్మరణ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. సినిమాలు చేసే సమయంలో రామోజీరావుతో ప్రత్యక్ష అనుబంధం లేదని, అయితే 2008లో నేరుగా ఒకసారి రామోజీరావును కలిసి మాట్లాడానని గుర్తుచేసుకున్నారు. బెదిరింపులకు ఏమాత్రం జంకకుండా.. జర్నలిస్టుల విలువలను కాపాడిన వ్యక్తి రామోజీ రావు అంటూ కొనియాడారు. 
 
ప్రభుత్వంలో జరిగే విషయాలను ప్రజలకు తెలియాలని ఉద్యమకర్త కూడా వ్యవహరించారు. ఎన్నికష్టనష్టాలొచ్చినా ఎదురేగి.. ప్రజల కోసం యజ్ఞం చేశారని.. ప్రశంసించారు. "ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న సమయంలో కూటమి విజయ వార్త విన్నారా లేదా అని నేను కూడా అడిగి తెలుసుకున్నాను. విజయ వార్త విన్న తర్వాతే ఆయన తన ప్రాణాలు విడిచారు. అటువంటి మహోన్నత వ్యక్తి విగ్రహం అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయాలి. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. ఎవరినైనా వారు చేసే పనిని బట్టే పాజిటివ్, నెగిటీవ్ వార్తలు వేస్తారు’’ అని అన్నారు. 
 
"రామోజీరావు ప్రజల పక్షపాతి... జర్నలిస్టు విలువను కాపాడటంలో ముందున్నారు. ప్రజల కోసం ఏం చేయాలనే అంశాలపైనే ఆలోచించారు. 2019లో నన్ను లంచ్ మీటింగ్‌కు రామోజీరావు ఆహ్వానించారు. దేశంలో, రాష్ట్రంలో పరిస్థితులు, పత్రికా రంగం గురించి మా మధ్య చర్చ సాగింది" అని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. తాను అప్ కమింగ్ లీడర్ అంటూ రామోజీరావు చెప్పారని.. ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారని పవన్ తెలిపారు. 
 
"నువ్వు ఏం చేస్తావో.. ఏం నమ్ముతావో త్రికరణ శుద్దిగా చేయి అని నాకు రామోజీరావు సూచించారు" అని పవన్ వెల్లడించారు. ఆయనకు కచ్చితంగా ఓ విగ్రహం ఏర్పాటు చేయాలని పవన్ ఉద్ఘాటించారు. భావితరాలకు ఆయన స్ఫూర్తి అంటూ ప్రశంసించారు.