ఆఫర్ల్ కోసం టెంప్ట్ అయితే ఇరుక్కోక తప్పదు: ఎపీ డిజిపి గౌతం సవాంగ్ వార్నింగ్
ఎపీ పోలీస్ శాఖలో సిబ్బంది అవినీతిపై డీజీపీ గౌతం సవాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆఫర్లకు టెంప్ట్ అవటం వలనే పోలీసు శాఖలో అవినీతి బయటపడుతుందని, ఇసుక, మద్యం అక్రమ రవాణాలో పోలీసు సిబ్బంది టెంప్ట్ అవుతున్నారని ఆయన పేర్కొన్నారు. తొందరపడితే కేసుల్లో ఇరుక్కోక తప్పదని ఆయన హెచ్చరించారు.
అంతేకాదు, ఇప్పటివరకు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం నమోదు చేసిన కేసుల్లో 53 మంది పోలీసుల పాత్ర కూడా ఉందని వారిపై కూడా కేసులు నమోదు చేశామని డీజీపీ స్పష్టం చేశారు. సొంత శాఖలలో పని చేస్తున్న వారిపై కేసులు పెట్టటం బాధగా ఉన్నా తప్పటం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇలాంటి అవినీతి పనులకు పోలీసులు దూరంగా ఉండాలని డీజీపీ పిలుపునిచ్చారు. పోలీసు శాఖలో సత్ప్రవర్తన, ఫిర్యాదుదారుల పట్ల సానుకూలంగా స్పందించటంపై ఎపీలోని 76 వేల మంది పోలీసులతో వెయ్యి ప్రాంతాల నుండి ఒకేసారి డీజీపీ ఆన్లైన్ ద్వారా ముఖాముఖి నిర్వహించారు. పోలీస్ స్టేషన్లకు ఎవరూ రావాలని కోరుకోరనీ, తీరని అన్యాయం జరిగినప్పుడు మాత్రమే బాధితులు పోలీస్ స్టేషన్ తలుపు తడతారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.