1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 14 జూన్ 2024 (11:23 IST)

జిల్లాల వారీగా ప్రతి ఒక్కరినీ కలుస్తా : మంత్రి పవన్ కళ్యాణ్

pawan kalyan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జిల్లాల వారీగా ప్రతి ఒక్కరినీ కలుస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. అదేవిధంగా శాసన సభ సమావేశాలు కూడా త్వరలోనే ఉంటాయి. వీటిని పూర్తి చేసుకున్న తర్వాత తనను అఖండ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం నియోజక వర్గ ప్రజలను కలుస్తాను. ఈ నెల 20వ తేదీ తర్వాత పిఠాపురం నియోజకవర్గంలోని కార్యకర్తలను కలుస్తాను. ఆ తర్వాత జిల్ల దశలవారీగా అన్ని గ్రామాల్లో పర్యటిస్తాను అని ప్రకటించారు. 
 
అలాగే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక నలుచెరగుల నుంచీ అభినందనలు, శుభాకాంక్షలు అందుతూనే ఉన్నాయి. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు, మేధావులు, నిపుణులు, సినీ రంగంలో ఉన్నవారు, యువత, రైతులు, ఉద్యోగ వర్గాలు, మహిళలు అభినందనలు అందిస్తున్నారు. జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు ఆనందంతో వేడుకలు చేసుకున్నారు. ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అని పేర్కొన్నారు. 
 
రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం తనను నేరుగా కలిసి అభినందించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశిస్తున్నారు. త్వరలోనే వారందరినీ జిల్లాలవారీగా కలసి  మాట్లాడాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఇందుకు సంబంధించిన షెడ్యూలు కేంద్ర కార్యాలయం ద్వారా తెలియజేస్తామని, అభినందనలు తెలియచేయడానికి వచ్చేవారు పూల బొకేలు, శాలువాలు తీసుకురావద్దని విజ్ఞప్తి చేస్తున్నట్టు ఆ ప్రకటనలో తెలిపారు.