మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 మే 2021 (11:09 IST)

'ఆర్ఆర్ఆర్' ప్రాణాలు తీసేందుకే జైలుకు తరలింపు : అమర్నాథ్ రెడ్డి

వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రాణాలు తీసేందుకే జైలుకు తరలించాలని మాజీ మంత్రి, టీడీపీ నేత అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు. ఎంపీకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? అంటూ ఆయన నిలదీశారు. 
 
ఎంపీ రఘురామ అరెస్టుపై ఆయన మాట్లాడుతూ, ఏపీ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం తప్ప ఎక్కడా రూల్ ఆఫ్ లా లేదు. జగన్ రెడ్డి అండ్ కో అవినీతిని ప్రశ్నించిన వారి ప్రాణాలను తీయడానికి సైతం వెనుకాడబోమని వైసీపీ చర్యలు స్పష్టం చేస్తున్నాయి. 
 
పోలీసులు కొట్టిన దెబ్బలకు రఘురామకృష్ణంరాజుకు సరైన వైద్యం అందించాలని కోర్టు ఆదేశించినా పట్టింసుకోవడం లేదు. రఘురామకృష్ణంరాజు ప్రాణాలను తీసేందుకే జైలుకు తరలించారు. న్యాయస్థానం ఆదేశాలను కూడా లెక్కచేసే పరిస్థితి లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
రమేష్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించకుండా రఘురామకృష్ణంరాజును జైలుకు తరలించడం పట్ల అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఆయన ప్రాణానికి ఏదైనా హాని జరిగితే సీఎందే బాధ్యత. జగన్ రెడ్డి అరాచక పాలనను ప్రజలు, మేధావులు నిరసించాలి. 
 
రాష్ట్రంలో ప్రజలతో ఎన్నికైన ఎంపీకే రక్షణ లేనప్పుడు సామాన్యులకు ఏం ఉంటుంది? ప్రభుత్వ లోపాలను ఎవరూ ప్రశ్నించకూడదా? నియంత పాలనకు ప్రజలు చరమగీతం పాడతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు.