శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 2 నవంబరు 2021 (14:49 IST)

ఏపీలో స్థానిక ఖాళీ స్థానాలకు నోటిఫికేషన్... అమల్లోకి ఎన్నికల కోడ్

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో వివిధ కారణాలతో ఎన్నికలు జరగని స్థానిక సంస్ధలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 14వ తేదీన పంచాయతీలకు, 15న మున్సిపాల్టీలు, కార్పొరేషన్లకు, 16న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వహించాలని నిర్ణయించింది.
 
 
ఇందులో తెదేపా అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తోన్న కుప్పం మున్సిపాల్టీలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ విడుదలతో నేటి నుంచి ఆయా ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ వెంటనే అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.  ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఎస్ఈసీ నీలం సాహ్నీ ఆదేశించారు.
 
 
 రాష్ట్రంలో వివిధ కారణాలతో ఎన్నికలు జరగని కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలు, ఎంపీటీసీ ,జడ్పీటీసీ స్థానాలు, గ్రామ పంచాయతీల్లోని సర్పంచులు, వార్డు మెంబర్ల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ సహా నోటిఫికేషన్​ను జారీ చేసింది. నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్​కు ఎన్నికలు జరిపేందుకు ప్రకటన జారీ చేసింది. గ్రేటర్‌ విశాఖలో రెండు డివిజన్‌ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. విజయనగరం, కాకినాడ, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌ల పరిధిలోని 10 డివిజన్‌ల్లో ఎన్నికలు నిర్వహించనుంది. 
 
 
 గ్రేటర్ విశాఖపట్నంలోని 31, 61 వార్డుల్లో ఎన్నికలు, విజయనగరం- 1వ వార్డు , కాకినాడలోని 3,9,16,30, వార్డులు, ఏలూరులోని 45,46 వార్డులు, మచిలీపట్నంలోని -32 వార్డు, గుంటూరులోని-6వ వార్డు, అనంతపురంలోని -17వ వార్డుకు ఈ నెల 15 న ఎన్నికలు జరగనున్నాయి.

 
వీటితో పాటు 12 మున్సిపాల్టీలు/ నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు, కృష్ణా జిల్లాలో జగ్గయ్య పేట, కొండపల్లి, గుంటూరు జిల్లాలో దాచేపల్లి, గురజాల, ప్రకాశం జిల్లాలో దర్శి, నెల్లూరు జిల్లాలో బుచ్చి రెడ్డి పాలెం, చిత్తూరు జిల్లాలో కుప్పం మున్సిపాల్టీలో ఎన్నికలు జరగనున్నాయి. కర్నూలు జిల్లాలో బేతంచర్ల , కడప జిల్లాలో కమలాపురం, రాజంపేట, అనంతపురం జిల్లాలో పెనుకొండ మున్సిపాల్టీలకు ఈ నెల 15న ఎన్నికలు నిర్వహించనున్నారు. 
 
 
 విజయనగరం జిల్లాలో బొబ్బిలిలోని 14 వార్డు , తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో 11 వార్డు , పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో 23 వార్డు, కృష్ణా జల్లా నూజివీడులో 27 వార్డు, గుంటూరు జిల్లా రేపల్లిలో 8,16 వార్డులు, మాచర్లలో 8వ వార్డు, ప్రకాశం జిల్లా అద్దంకిలో 8 వార్డు, కడప జిల్లాలో బద్వేలులో 11వ వార్డు, చిత్తూరు జిల్లా నగరిలో 16 వ వార్డు, కర్నూలు జిల్లా నందికొట్కూరులో 10 వ వార్డు, ఎమ్మిగనూరులో 10 వ వార్డు, అనంతపురం జిల్లా రాయదుర్గంలో 1 వ వార్డు లో ఎన్నికలు జరగనున్నాయి.
 
రాష్ట్రవ్యాప్తంగా వివిధ కారణాలతో ఎన్నికలు జరగని 338 మండలాల్లోని మొత్తం 498 గ్రామ పంచాయతీల పరిధిలోని 69 సర్పంచ్‌ పదవులకు, 533 వార్డు మెంబర్‌ స్థానాలకు ఎన్నికలు నిర్వహణకు ఎస్​ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా స్థానాల్లో ఈ నెల 14న ఎన్నికలు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. 
 
 వీటితోపాటు రాష్ట్ర మొత్తం మీద వివిధ కారణాలతో ఆగిపోయిన, ఖాళీ అయిన 187 ఎంపీటీసీ స్థానాలు, 14 జెడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 16 న ఎన్నికలు జరిపేందుకు ప్రకటన జారీ చేసింది. గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలు, ఎంపీటీసీ, జడ్పీటీసీల్లో ఎన్నికలకు ఈనెల 3న స్థానికంగా ఎన్నికల నోటీసును జారీ చేస్తారు.
 
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావటంతో ఆయా ప్రాంతాల్లో ఇవాళ్టి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పట్టణ స్థానిక సంస్థల్లో వార్డుల్లో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఆయా మున్సిపల్ కార్పొరేషన్, లేదా మున్సిపాలిటీ, నగర పంచాయతీ మొత్తానికి ఎన్నికల కోడ్ వర్తిస్తుంది. జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్న చోట ఆ ప్రాంత రెవెన్యూ డివిజన్ మొత్తానికీ కోడ్ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎంపీటీసీ ఎన్నికలు జరిగే చోట ఆ మండలం మొత్తం ఎన్నికల కోడ్ వర్తిస్తుంది. గ్రామాల్లో వార్డులు, సర్పంచి ఎన్నికలు జరిగే చోట ఆయా గ్రామ పంచాయతీకి మాత్రమే ఎన్నికల కోడ్ వర్తిస్తుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికలు పారదర్శకంగా జరిపేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఎస్ఈసీ నీలం సాహ్నీ ఆదేశించారు.
 
నామినేషన్ల ఉపసంహరణకు గడువు
 
పట్టణ స్థానిక సంస్థలు - 8-11-2021 (మధ్యాహ్నం 3 గంటల వరకు)
 
 గ్రామ పంచాయతీలు - – 9-11-2021 (మధ్యాహ్నం 3 గంటల వరకు)
 
 ఎంపీటీసీ, జెడ్పీటీసీ - 9-11-2021 (మధ్యాహ్నం 3 గంటలవరకు)
 
పోలింగ్..
 
 గ్రామ పంచాయతీలు – 14-11-2021 (ఉదయం 7 నుంచి 1 గంట వరకు)
 
 పట్టణ స్థానిక సంస్థలు – 15-11-2021 (ఉదయం7 నుంచి 5 గంటల వరకు)
 
 ఎంపీటీసీ , జెడ్పీటీసీ- 16-11-2021 (ఉదయం 7 నుంచి 5 గంటల వరకు)
 
ఎన్నికల ఫలితాలు..
 
 గ్రామ పంచాయతీలు – 14-11-2021 (మధ్యాహ్నం 2 గంటల తర్వాత)
 
 పట్టణ స్థానిక సంస్థలు – 17-11-2021 (ఉదయం 8 గంటల నుంచి)
 
 ఎంపీటీసీ, జెడ్పీటీసీలు- 18-11-2021 (ఉదయం 8 గంటల నుంచి)