ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 మార్చి 2024 (13:51 IST)

బుద్ధి లేనివారు పోతే పోనివ్వండి - అమ్మ ఒడి డబ్బులు తీసుకుని అడ్డంగా మాట్లాడితే ఏం చేద్దాం: ధర్మాన

dharmana
ప్రభుత్వం అందించే సంక్షేమ సహాయాలను పొందుతున్న లబ్దిదారులను ఉద్దేశించి ఏపీ మంత్రి ధర్మాన ప్రసాద రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమ్మ ఒడి పొంది అడ్డంగా మాట్లాడితే ఏం చేయాలి అని ఆయన ప్రశ్నించారు. పైగా, ఏ ఒక్కరి ప్రమేయం లేకుండా, ఒక్క పైసా లంచం ఇవ్వకుండా పథకాల సొమ్ము మీ ఖాతాల్లో పడుతుంటే మా సమావేశాలక మీరెందుకు ఉంటారు అంటూ వ్యాఖ్యానించారు. 
 
శ్రీకాకుళంలో సోమవారం చేనేత కుటుంబాలతో ఆత్మీయ సమావేశం, వైఎస్ఆర్ చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందులో మంత్రి ధర్మాన పాల్గొని ప్రసంగించారు. చేయూత సమావేశ ప్రాంగణం ప్రధాన గేటు మూసి వాలంటీర్లు కాపలా ఉన్నా మంత్రి ప్రసంగానికి ముందే మరో గేటు నుంచి మహిళలు బయటకు వెళ్లిపోతుండటంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. 'నేను వచ్చే ముందు వారిని ఇక్కడికి తీసుకురమ్మని మా వాళ్లకు చెబుతా. నాకంటే ముందు వాళ్లు వచ్చేస్తే ఇలానే జరుగుతుంది' అని పేర్కొన్నారు.
 
 'పథకాల లబ్ధి పొంది ప్రభుత్వానికి విధేయులుగా లేని పనికిమాలిన వారి గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ప్రభుత్వం నడిపిన వారిగా మేం చెబుతున్నాం. మాకు వర్గం, కులం, మతం వద్దు. జెండా కట్టినా కట్టకపోయినా.. వాడి ఒంటిపై పసుపు చొక్కా ఉన్నా మనకు మొన్న ఓటు వేయకపోయినా.. రేపు మరలా మాకు ఓటు వేయరని అనుకున్నా వారి కన్నీరు తుడిచే పని మేం చేస్తాం. మాకు ఓ వర్గం ఉంది. నేను ఆ వర్గంలోనే ఉంటానని వారంటే నేనేం చేయను. అటువంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బుద్ధి లేనివారు పోతే పోనివ్వండి. ఈ ప్రభుత్వం అందించిన మంచి ఆహార గింజలు తిని.. విద్యా సౌకర్యాలు, అన్ని రకాల రిజర్వేషన్లు, నేతన్న నేస్తం, అమ్మ ఒడి పొంది అడ్డంగా మాట్లాడితే అటువంటి వారిని వదిలేయాలి' అని మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు.