బీజేపీలో టీడీపీ నేతలు చేరడానికి కారణమేంటో తెలుసా?
తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ చర్య తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఏమాత్రం మింగుడుపడని అంశంగా మారింది.
ఈ నేపథ్యంలో ఆ నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీలో చేరడానికిగల కారణాలను ఏపీ బీసీ సంక్షేమ శాఖామంత్రి శంకర నారాయణ వివరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అనుమతితోనే ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారన్నారు.
ముఖ్యంగా 2024 అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు చంద్రబాబు కుటిల రాజకీయాలు చేస్తున్నారనీ, అందులోభాగంగానే ఆ పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు టీడీపీలో చేరారని అన్నారు. పైగా, బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యుల్లో సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్‌లు పారిశ్రామికవేత్తలనీ, వీరందరిపై వివిధ కేసులు ఉన్నాయన్నారు. ఈ కేసుల నుంచి విముక్తి పొందేందుకే వారు కాషాయం కండువా కప్పుకున్నారన్నారు.
ఇకపోతే, నవ్యాంధ్రలో పసుపు పాలన అంతమైందన్నారు. ప్రస్తుతం రాజన్న రాజ్యం మొదలైందన్నారు. అలాగే, ప్రత్యేక హోదా అన్నది జగన్ నినాదమని, దాన్ని సాధించి తీరుతామని మంత్రి శంకర్ నారాయణ అన్నారు.