మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 4 నవంబరు 2022 (23:57 IST)

పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా బోధన, శిక్షణ: చదలవాడ నాగరాణి

chadalawada
తరగతి గది అభ్యాసంతో పాటు పరిశ్రమ రంగానికి అవసరమైన ప్రత్యేక శిక్షణను అందించేందుకు సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణను చేపట్టిందని సంచాలకురాలు చదలవాడ నాగరాణి తెలిపారు. వివిధ డిప్లొమా కోర్సులకు సంబంధించి చివరి సంవత్సరంలో ఆరు నెలల నాణ్యమైన పారిశ్రామిక శిక్షణను విద్యార్ధులకు అందించే క్రమంలో చేపడుతున్నచర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మధ్యస్ధ పరిశ్రమల అసోసియేషన్, సాంకేతిక విద్యాశాఖ నడుమ విద్యార్ధుల పారిశ్రామిక శిక్షణకు సంబంధించి శుక్రవారం అవగాహనా ఒప్పందం జరిగింది.
 
14 రకాల పరిశ్రమలలో 229 మంది విద్యార్థులకు పారిశ్రామిక శిక్షణను అందించడానికి అసోసియేషన్ ముందుకు రాగా,  ఈ మేరకు వారి నుండి సమ్మతి లేఖలను నాగరాణి అందుకున్నారు. ఈ సందర్భంగా సంచాలకురాలు మాట్లాడుతూ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్ధులను తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా తాము కృషి చేస్తున్నామన్నారు.
 
 ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ విద్యార్థులకు నాణ్యమైన పారిశ్రామిక శిక్షణను అందించడానికి సాంకేతిక విద్యా శాఖ అన్ని ప్రయత్నాలు చేస్తుందన్నారు. గత కొంత కాలంగా వివిధ పరిశ్రమల సంఘాలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. సూక్ష్మ చిన్న మధ్యస్ధ పరిశ్రమల అసోసియేషన్ ప్రతినిధులు టి పార్థ సారధి, ఎమ్ ఎస్ రామచంద్రరావు, వి రమేష్ బాబుతో పాటు సాంకేతిక విద్యాశాఖ సంయిక్త సంచాలకులు వి పద్మారావు, ఉప సంచాలకులు డాక్టర్ ఎం ఎ వి రామకృష్ణ , విజయ భాస్కర్ తదితరలు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.