సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (08:13 IST)

ఏపీలో జెడ్పీటీసీ - ఎంపీటీసీ ఎన్నికలకు శంఖారావం : 8న పోలింగ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానిక సంస్థలకు ఎన్నికల శంఖారావం మోగింది. ఈ సంస్థలక ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది. దీనిప్రకారం ఈ నెల 8న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ నిర్వహిస్తారు. 9వ తేదీన అవసరమైన చోట రీ పోలింగ్ నిర్వహిస్తారు. 10న పరిషత్‌ ఎన్నికల ఫలితాలు విడుదల విడుదల చేస్తారు. 
 
ఇదే విషయంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరిషత్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని, కలెక్టర్లు, ఎస్పీలు, పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లాల్లో కోవిడ్ పరిస్థితులపై ఎస్ఈసీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. 
 
మరోవైపు, శుక్రవారం రాజకీయ పార్టీలతో నీలం సాహ్ని సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పరిషత్ ఎన్నికల నిర్వహణపై ఆమె అభిప్రాయాలు తీసుకోనున్నారు. అయితే పరిషత్ ఎన్నికలపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. ఈ లోపు కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
 
ఇదిలావుంటే, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలకు నిరసనగా ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
 
మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఉన్నప్పుడే రెచ్చిపోయిన అధికార పార్టీ.. ఇప్పుడు ఆయన లేకుండా జరిగే ఎన్నికలను మరింత దిగజారుస్తాయంటూ టీడీపీ నేతలు చెబుతున్నారు. ఎస్‌ఈసీ నీలం సాహ్ని నేతృత్వంలో జరిగే ఎన్నికలు ఏకపక్షంగానే జరుగుతాయని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. నిష్పక్షపాతంగా జరగవన్న విషయాన్ని తెలిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని టీడీపీ నేతలు చెబుతున్నారు.