1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 29 జులై 2021 (10:16 IST)

జగన్న విద్యా దీవెన : నేడు రెండో విడత నిధుల విడుదల

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకాల్లో ఒకటి జగనన్న విద్యా దీవెన ఒకటి. ఈ పథకం కింద రెండో విడత నిధులను సీఎం జగన్ గురువారం లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. 
 
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ కంప్యూటర్‌ మీట నొక్కి 10.97 లక్షల మంది విద్యార్థులకు రూ.693.81 కోట్ల బోధన రుసుముల్ని విడుదల చేస్తారు. ఇవి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ అవుతాయి. 
 
ఈ పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్ధులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని చెల్లించేందుకు వీలుగా ప్రతీ త్రైమాసికానికి ఒక మారు విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా ఈ మొత్తాలను జమ చేస్తున్న విషయం తెల్సిందే. 
 
అలాగే, వసతి దీవెన పథకం ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్ధులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్ధులకు రూ.15 వేలు, డిగ్రీ ఆపై కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున వసతి, భోజన ఖర్చుల కోసం తల్లుల ఖాతాల్లోకి నేరుగా ప్రభుత్వం జమ చేస్తూ వస్తోంది. కాగా, విద్యారంగంపై ఇప్పటివరకు 26,677.82 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.