ఏపీలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలకు ఏర్పాట్లు
అక్టోబరు 4న ఆదివారం రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం నగరాల్లోని 68 పరీక్షా కేంద్రాల్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ కు సంబంధించి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ వ్రాత పరీక్షలను నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి(పొలిటికల్) ప్రవీణ్‌ప్రకాశ్ తెలిపారు.
ఈ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు వీలుగా సంబంధిత జిల్లాల కలెక్టర్లు కోఆర్డినేటింగ్ సూపర్‌వైజర్ అధికారులుగాను విశాఖపట్నం, విజయవాడ కేంద్రాల్లో ఇద్దరు చొప్పున సీనియర్ ఐఏఎస్ అధికారులు, తిరుపతి, అనంతపురం కేంద్రాల్లో ఒక్కో సీనియర్ ఐఏఎస్ అధికారిని పరిశీలకునిగా నియమించడం జరిగిందన్నారు.
వ్రాత పరీక్షలకు మొత్తం 30,199 మంది అభ్యర్ధులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. పరీక్షలు జరిగే రోజున ఉదయం 9.30 నుండి 11.30గంటల వరకూ మరలా మధ్యాహ్నం 2.30 నుండి 4.30గంటల వరకూ రెండు సెషన్లలో జరిగే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ వ్రాత పరీక్షలకు హాజరు కాబోయే అభ్యర్ధులు పరీక్ష ప్రారంభానికి గంట ముందు ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొన్నారు.
పరీక్ష ప్రారంభానికి 10నిమిషాల ముందు ఆయా పరీక్షా కేంద్రాల గేటులను మూసివేయడం జరుగుతుందని అనంతరం అభ్యర్ధులను లోనికి అనుమతించరని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల్లోకి బ్యాగులు, మొబైల్ ఫోన్లు, ఐటి సంబంధిత వస్తువులు, ఇతర ఎలక్ట్రానిక్, కమ్యునికేషన్ సంబంధిత వస్తువులు అనుమతించరని పేర్కొన్నారు.
కరోనా మహమ్మారి నేపధ్యంలో పరీక్షకు హాజరయ్యే ప్రతి అభ్యర్ధీ విధిగా మాస్క్ లేదా ఫేస్ కవర్ ధరించి మాత్రమే పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. ఆయా పరీక్షా కేంద్రాల ప్రాంగణాలు, ప్రవేశ ద్వారాలు, పరీక్షా హాలుల్లోని టేబుళ్ళు, కుర్చీలు, వాష్ రూమ్‌లు, మరుగుదొడ్లను పూర్తిగా శానిటైజ్ చేయించాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.
ప్రతి పరీక్షా హాల్ వద్ద శానిటైజర్, ఫేస్ మాస్క్, గ్లౌజులు అందుబాటులో ఉంచేలా ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. అదే విధంగా పరీక్షా హాల్లో అభ్యర్థులు మధ్య 2 చదరపు మీటర్ల భౌతిక దూరం ఉండే విధంగా సీటింగ్ ఏర్పాట్లు చేయడంతో పాటు పరీక్షా కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు ప్రవీణ్‌ప్రకాశ్ తెలిపారు.