బాలు మృతి పట్ల ఏపి గవర్నర్ సంతాపం
చెన్నైలోని ఓ ఆసుపత్రిలో సుదీర్ఘ కాలంగా చికిత్స పొందుతున్న ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మృతి చెందటం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ మేరకు శుక్రవారం రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. గవర్నర్ హరించందన్ మాట్లాడుతూ బాలసుబ్రహ్మణ్యం కేవలం తెలుగు భాషలోనే కాకుండా దేశం మొత్తం మీద 16 భాషలలో నేపథ్య గాయకునిగా సంగీత అభిమానుల ప్రశంసలు అందుకున్నారని ప్రస్తుతించారు.
ప్రధానంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషలలో ప్రతిభావంతమైన గాయకుడుగా పండిత, పామరులను అలరించారని పేర్కొన్నారు. దివంగత బాల సుబ్రహ్మణ్యం ఒక గాయకుడిగా 40వేల అత్యధిక పాటలను రికార్డ్ చేసినందుకు గిన్నిస్ రికార్డును కూడా కలిగి ఉన్నారని గుర్తు చేసుకున్నారు.
2011లో పద్మ భూషణ్ దక్కించుకోగా, ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఆరు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 25 నంది అవార్డులు, ఎన్టీఆర్ జాతీయ పురస్కారం... ఇలా అనేక అవార్డులను అందుకున్నారని తెలిపారు. బాలు ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ఈ సందర్భంగా బాలు కుటుంబ సభ్యులకు గవర్నర్ హృదయపూర్వక సంతాపం తెలిపారు.