1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 5 నవంబరు 2019 (19:51 IST)

ప్ర‌తి ఒక్క‌రూ మొక్క‌లు నాటాలి: ఏపి గ‌వ‌ర్న‌ర్

వేగంగా మారుతున్న వాతావరణ పరిస్ధితులను మెరుగు పరిచి, కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు.

పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మంగళవారం రాజ్ భవన్ ప్రాంగణంలో గవర్నర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా తనకు మొక్కల పెంపకం పట్ల మంచి ఆసక్తి ఉందని, ఏ కార్యక్రమానికి వెళ్లినా తాను మొక్కలు నాటేందుకు తొలి ప్రాధన్యత ఇస్తానని వెల్లడించారు.

పచ్చదనం పెంపుకు దోహద పడాలని ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారని, ప్రజలు తదనుగుణంగా స్పందిస్తూ మొక్కల పెంపకాన్ని చేపట్టాలని సూచించారు. రాజ్ భవన్ ప్రాంగణంలో ఉసిరి, తులసి మొక్కలను నాటిన గవర్నర్ ఔ షధ గుణాలు కలిగిన ఈ మొక్కలు భారతదేశానికి ప్రాముఖ్యమైనవని, వాటిని వాతావరణ మార్పుల వల్ల అంతరించి పోకుండా కాపాడాలని కోరారు.

కార్యక్రమంలో గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా, సంయిక్త కార్యదర్శి అర్జునరావు తదితరులు పాల్గొన్నారు.