గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 3 నవంబరు 2019 (21:19 IST)

మోడీ ఇంట అవమానం: ఎస్పీ బాలు

ప్రధానమంత్రి నరేంద్రమోడీ చిత్ర పరిశ్రమ పెద్దలతో నిర్వహించిన ఛేంజ్ విత్ ఇన్ కార్యక్రమంపై విమర్శల దుమారం చెలరేగుతూనే వస్తోంది.

బాలీవుడ్ స్టార్ హీరోలు, ముంబై చలన చిత్ర పరిశ్రమ పెద్దలకు ప్రధానమంత్రి గౌరవం ఇచ్చారని, దక్షిణాది చిత్ర పరిశ్రమను చిన్నచూపు చూశారని మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన ఆవేదన వ్యక్తం చేశారు. మోడీని ఉద్దేశించి ఆమె ట్వీట్ చేశారు.

దీనిపై చిత్ర పరిశ్రమలో చెలరేగిన దుమారం తగ్గక ముందే..ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నివాసంలో బాలీవుడ్ స్టార్ హీరోలకు ఒకరకంగా.. మాలాంటి కళాకారులను ఇంకోరకంగా ట్రీట్ చేశారని, వివక్షను చూపారని చెప్పుకొచ్చారు.
 
బాలీవుడ్ కే పెద్ద పీట..
జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని కొద్దిరోజుల కిందట ప్రధాని నరేంద్రమోడీ తన నివాసంలో చిలన చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, ఇతర కళాకారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

బాలీవుడ్ హీరోలు, పలువురు సెలెబ్రిటీలు షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, కంగన రనౌత్, సోనమ్ కపూర్ తదితరులు దీనికి హాజరయ్యాురు. ప్రధాని మోడీతో సెల్ఫీలు దిగారు. దీనికి సంబంధించిన ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. టాలీవుడ్ నుంచి నిర్మాత దిల్ రాజు, లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హాజరయ్యారు.
 
గేటు వద్ద సెల్ ఫోన్లను లాక్కున్నారంటూ..
ప్రధాని నివాసానికి చేరుకోవడానికి ముందే- అక్కడి భద్రతా సిబ్బంది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సహా కొందరు కళాకారులు, చిత్ర పరిశ్రమకు చెందిన టెక్నీషియన్ల సెల్ ఫోన్లను లాక్కుని, టోకెన్లు ఇచ్చారు. ఈ విషయాన్ని ఎస్పీబీ తాజాగా వెల్లడించారు.

భద్రతా చర్యల్లో భాగంగా అందరి సెల్ ఫోన్లను తీసుకుని ఉండొచ్చని తాను భావించానని, తీరా చూస్తే.. స్టార్ హీరోలు, బాలీవుడ్ కు చెందిన కొందరు సినీ ప్రముఖుల చేతుల్లో సెల్ ఫోన్లు కనిపించాయని అన్నారు. అవే సెల్ ఫోన్లతో బాలీవుడ్ సెలెబ్రెటీలు నరేంద్ర మోడీతో సెల్ఫీలు దిగారని చెప్పుకొచ్చారు. ఈ విషయం తనను తలవంపులకు గురి చేసిందని అంటూ ఆయన తన ఫేస్ బుక్ లో రాసుకొచ్చారు.
 
 థింగ్స్ దట్ మేక్ యు గో..
ఈనాడు రామోజీరావు గారి వల్లే తాను ప్రధానమంత్రి నిర్వహించిన కార్యక్రమానికి వెళ్లగలిగానని, ఈ అవకాశం కల్పించినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. అదే కార్యక్రమంలో తనతో పాటు కొందరు కళాకారుల పట్ల అవమానకరంగా ప్రవర్తించడం దిగ్భ్రాంతికి గురి చేసిందని ఫేస్ బుక్ లో రాశారు.

ఉపాసన అసంతృప్తిని వ్యక్తం చేసిన అనంతరం.. ప్రధానమంత్రి కార్యాలయం స్పందించిందని, చిరంజీవి, రామ్ చరణ్ లను ఢిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానం పంపినట్లు వార్తలు వెలువడ్డాయి. తాజాగా- ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం పట్ల బీజేపీ నాయకులు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితిని కల్పించినట్టయింది.