శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 16 ఆగస్టు 2018 (11:59 IST)

తిరుమలలో ముగిసిన మహా సంప్రోక్షణ.. భక్తులకు శ్రీవారి దర్శనం

కలియుగ వైకుంఠం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో మహా సంప్రోక్షణ కార్యక్రమం గురువారం ముగియనుంది. ఆరు రోజుల పాటు కొనసాగుతున్న మహా సంప్రోక్షణను టీటీడీ అధికారులు గురువారంతో ముగించనున్నారు. గురువారం మధ్యాహ

కలియుగ వైకుంఠం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో మహా సంప్రోక్షణ కార్యక్రమం గురువారం ముగియనుంది. ఆరు రోజుల పాటు కొనసాగుతున్న మహా సంప్రోక్షణను టీటీడీ అధికారులు గురువారంతో ముగించనున్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలలోపు స్వామివారి మూలమూర్తిలో జీవకళలను మళ్లీ ప్రవేశ పెట్టి మహా సంప్రోక్షణ క్రతువును ముగించనున్నారు. 
 
ఈనెల 11 వతేదీ రాత్రి శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమానికి అంకురార్పణ నిర్వహించారు. 12వ తేదీన ఆలయంలో వైదిక కార్యక్రమాల్ని వేణుగోపాల దీక్షితుల ఆధ్వర్యంలో చేపట్టారు. మహాసంప్రోక్షణలో భాగంగా సోమవారం తిరుమల స్వామివారికి రుత్వికులు శాస్త్రోక్తంగా అష్టబంధనం నిర్వహించారు.
 
ఆరు రోజుల పాటు కొనసాగిన ఈ మహా సంప్రోక్షణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 45మంది రుత్వికులు, 20మంది యాగ పారాయణదారులు, 50మంది పురాణ పఠనదారులు, 40 మంది దివ్య ప్రబంధనదారులు పాల్గొని స్వామివారికి సేవలందించారు.
 
ఇక మహా సంప్రోక్షణలో భాగంగా బుధవారం స్వామివారికి తిరుమంజనంను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. గోపురాల కలశాలను అద్దంలో చూసి... వాటి ప్రతిబింబాలకు అభిషేకం చేశారు. తిరుమలలోని పలు ఆలయాల గోపురాల కలశాలకు పవిత్రజలం, పాలతో అభిషేకాలు నిర్వహించారు.
 
మహా సంప్రోక్షణ మొదటి ఘట్టంలో స్వామివారికి నిత్య నిర్వహించే సేవల అనంతరం ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో పుణ్యాహవచనం అనంతరం వాస్తు హోమం నిర్వహించారు. దేహశుద్ధి కోసం ఆకల్మషా హోమాన్ని అర్చకులు జరిపారు. మధ్యాహ్నం 12 గంటలలోపు ఈ హోమాలన్నీ నిర్వహించి భక్తులకు లోపలకి అనుమతించారు.
 
అలాగే మహాసంప్రోక్షణ ముగియనుండటంతో గురువారం అర్థరాత్రి నుంచి దివ్యదర్శనం, సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ పునరుద్ధరించనుంది. శుక్రవారం నుంచే శ్రీవారికి యధావిధిగా అన్ని ఆర్జిత సేవలు కొనసాగనున్నాయి.