సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , గురువారం, 23 సెప్టెంబరు 2021 (17:41 IST)

ఆత్మకూరు ఘటన దుర్మార్గం...బిడ్డల ఆలనాపాలనకు ప్రభుత్వ అండ

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మెప్మా రిసోర్స్ పర్సన్ కొండమ్మ మృతి అత్యంత  హేయమైన సంఘటనగా రాష్ట్ర మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ అభివ‌ర్ణించారు. నిత్యం గృహహింస తాళలేక ఉరిపోసుకుని కొండమ్మ ఆత్మహత్య చేసుకోవడం.. ఘటనాస్థలంలోనే ఉన్న ఆమె భర్త ప్రాణాలను కాపాడకపోగా, వీడియో తీసి పైసాచికానందం పొందడంపై వాసిరెడ్డి పద్మ తీవ్రంగా స్పందించారు. 
 
తిరుపతి పర్యటనలో ఉన్న ఆమె గురువారం హుటాహుటిన ఆత్మకూరుకి వచ్చారు. పట్టణంలోని జె.ఆర్ పేటలో నివాసం ఉంటున్న కొండమ్మ ఇంటికి వెళ్లి, ఉరిపోసుకున్న పరిసరాలను పరిశీలించారు. కొండమ్మ పిల్లలను వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారితో మాట్లాడారు. సాక్షాత్తు భర్త భార్యను ఆత్మహత్యకు ప్రోత్సహిస్తూ వీడియో తీస్తూ పైసాచికానందం పొందడం బాధాకరమన్నారు. వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని పిల్లలకు పద్మ భరోసా కల్పించారు. ఇటువంటి సంఘటన మానవత్వం ఉన్న మనుషులకు సిగ్గుచేటైన సంఘటనగా చెప్పారు. 
 
మృతురాలి తల్లి పెంచలమ్మ, మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్ మాధవి, మరికొందరు రిసోర్స్ పర్సన్లతో వాసిరెడ్డి పద్మ నేరుగా మాట్లాడి కొండమ్మ మృతికి కారణాలు ఆరాతీశారు. అనంతరం ఆత్మకూరు పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో వాసిరెడ్డి పద్మ  మాట్లాడుతూ, కట్టుకున్న భార్య  ప్రాణం తీసుకుంటూ ఉంటే ఆమె భర్త  కనీసం మనిషిగా కూడా స్పందించక పోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయమన్నారు. ఇటువంటి సంఘటన ఒక స్త్రీ లోకానికి కాకుండా మానవ సమాజానికి తీరని మచ్చ అన్నారు. భార్య అంటే చిన్నచూపు, ఆమెపై సర్వహక్కలున్నాయనే పెంచలయ్య వంటి మృగాళ్లకు తగిన బుధ్ధి చెప్పేందుకు మహిళా కమిషన్ వెనుకాడదన్నారు. మనుషుల మధ్య ఇలాంటి వాళ్లు ఉన్నారా అనిపించే ఈ సంఘటన ఇదన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు చేపడతామని అన్నారు. ఏ చిన్న సంఘటన లను కూడా రాష్ట్ర పోలీస్ స్పందించే విధంగా దిశా యాప్ ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి ప్రచారం చేస్తూ ఉన్నా, దానిని ఉపయోగించుకునే అవగాహన లేకపోవడం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని రాష్ట్ర సచివాలయ పోలీస్ వ్యవస్థ ద్వారా మరింతగా దిశ యాప్ గురించి ప్రచారం నిర్వహిస్తామని అన్నారు. 
 
కొండమ్మ పిల్లల ఆలనాపాలనా చూసేందుకు ప్రభుత్వం సిద్ధమన్నారు. అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడారు. తల్లి మరణంతో...తండ్రి జైలుపాలవడంతో అనాథలుగా  తల్లడిల్లిపోతున్న ఇద్దరు బిడ్డలకు తగు న్యాయం చేస్తామని  .. కొండమ్మ మృతికి ప్రత్యక్షంగా కారకుడైన ఆమె భర్త ను కఠినంగా శిక్షించేందుకు పూర్తి చర్యలు చేపడుతున్నామని వాసిరెడ్డి పద్మ హామీనిచ్చారు. మహిళకు అరచేతి రక్షణగా ఉన్న 'దిశ' యాప్ సద్వినియోగం చేసుకుని బాధిత మహిళలు గెలవాలన్నారు. అవమానాలు ఎదుర్కొంటున్న మహిళలు మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడి.. మరణమే శరణ్యమనుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. దిశ బిల్లు ప్రతులను తగులబెట్టిన ప్రతిపక్ష నేత నారా లోకేష్ వంటి ప్రబుద్ధులే ఆత్మకూరులో పెంచలయ్యలాంటి కసాయిలను పెంచిపోషిస్తున్నారని వాసిరెడ్డి ఘాటుగా స్పందించారు. వైజాగ్ లో జరిగిన సంఘటనపై మాట్లాడుతూ నిందితులు ఏ పార్టీ వారైనా కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వీరి వెంట మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జెల లక్ష్మి, కమిషన్ డైరెక్టర్ సూయజ్,  జిల్లా అధికారులు, స్థానిక ఆర్డీవో, పోలీస్ అధికారులు హాజరయ్యారు.