శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 ఫిబ్రవరి 2023 (11:04 IST)

ఆత్రేయపురం పూతరేకులకు మరో ఘనత - జీఐ ట్యాగ్ ఖాయం?

pootharekulu
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం అనగానే ప్రతి ఒక్కరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది పూతరేకులు. వీటిని తలచుకుంటేనే నోట్లో  లాలాజలం ఊరుతుంది. ఈ ఆత్రేయపురం పూతరేకులకు అంతటి గుర్తింపు ఉంది. ఇపుడు ఈ పూత రేకులు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకునే దిశగా అడుగు ముందుకుపడింది. పూతరేకులకు భౌగోళిక గుర్తింపు తీసుకొచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు దాదాపు చివరి దశకు వచ్చాయి. 
 
ఆత్రేయపురానికి చెందిన సర్ ఆర్థర్ కాటన్ పూతరేకుల సహకార సంఘం, వైజాగ్ దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనవర్శిటీ సహకారంతో భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) కోసం చేసుకున్న దరఖాస్తు ఇపుడు పరిశీలనలో ఉంది. ఇదే అంశంపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ఈ నెల 13వ తేదీన విడుదల చేసిన జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ జర్నల్‌లో ఆత్రేయపురం పూతరేకుల గుర్తింపుపై ఓ ప్రకటన చేశారు. 
 
ఈ విషయంలో ఎవరి నుంచి అభ్యంతరం రాకుంటే చెన్నైలోని జీఐ రిజిస్ట్రేషన్ కార్యాలయం జిఐని నమోదు చేసి పూతరేకులకు భౌగోళిక గుర్తింపు ఇస్తున్నట్టు జర్నల్‌పో ప్రచురించింది. కాగా, ఇది కూడా త్వరలోనే వస్తుందని పూతరేకుల సహకార సంఘం ఆశాభావం వ్యక్తం చేసింది.