బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 24 అక్టోబరు 2019 (17:23 IST)

29న ఇంద్రకీలాద్రిపై గాజుల ఉత్సవం

ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈ నెల 29వ తేదీన గాజుల ఉత్సవం అత్యంత వైభవంగా జరుగనుంది. ఉత్సవంలో భాగంగా అమ్మవారి మూలవిరాట్‌ను వివిధ రకాల మట్టి గాజులతో  అలంకరిస్తారు.

అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ప్రాంగణాన్ని రంగురంగుల గాజులతో ముస్తాబు చేస్తారు. ఇంద్రకీలాద్రిపై  2016 నుంచి ప్రారంభించిన ఈ విశేష పూజ ఎంతో ప్రాచుర్యం పొందింది. తొలి ఏడాది కేవలం 5 లక్షల గాజులతో ఉత్సవాన్ని ప్రారంభించగా, ఈ ఏడాది కోటి గాజుల ఉత్సవాన్ని  నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

అమ్మవారి గాజుల అలంకరణకు అవసరమైన కొన్ని గాజులను దేవస్థానం కొనుగోలు చేస్తుంది. భక్తుల నుంచి కూడా భారీ స్థాయిలో గాజులు విరాళంగా దేవస్థానానికి అందుతాయి. భక్తులు అందించే గాజులను స్వీకరించేందుకు దేవస్థానం ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేస్తుంది.

ఇప్పటికే పలువురు భక్తులు అందచేసిన గాజులు దేవస్థానానికి చేరాయి. ఉత్సవానికి మరో 5 రోజులు ఉండటంతో గాజులు మరిన్ని విరాళాలుగా దేవస్థానానికి అందే అవకాశం ఉందని ఆలయ అధికారులు భావిస్తున్నారు. 
 
ప్రాచీనకాలం నుంచి చేస్తున్న పూజ   
15, 18వ శతాబ్దంలో అమ్మవారికి గాజుల అలంకారం చేసినట్లు పురాణాల్లో చెప్పబడింది. 15వ శతాబ్దంతో విజయనగర మహారాజు అమ్మవారి అలంకరణ నిమిత్తం బంగారు ఆభరణాలను తయారు చేయించడంతో పాటు గాజులతో విశేష అలంకరణ చేసినట్లు చెప్పబడుతోంది.

కార్తీక మాసంలో రెండో రోజున భగిని హస్త భోజనం అని, యమ ద్వితీయ అని పిలవబడుతుంది. ఆ రోజున తమ్ముళ్లు, అన్నయ్యలు అక్కాచెల్లెళ్ల ఇళ్లకు వెళ్లి.. వారి చేతి భోజనం చేసి చల్లగా ఉండాలని దీవించి పసుపు, కుంకుమ, గాజులు అందజేయడం ఆనవాయితీగా వస్తోంది.  అమ్మవారిని కూడా మన ఇంటి ఆడపడుచుగా భావించి భక్తులు గాజులు, పసుపు, కుంకుమను సమర్పిస్తారు. 
 
అమ్మవారి ప్రసాదంగా వితరణ  
అమ్మవారికి అలంకరించే ఆభరణాల నుంచి పూల వరకు అన్నీ గాజులతోనే తయారు చేసి ముస్తాబు చేయడం ఈ ఉత్సవంలో విశేషం.

ఉత్సవం ముగిసిన తర్వాత అమ్మవారికి అలంకరించిన గాజులను భక్తులుకు ఉచితంగా పంపిణీ చేస్తారు. ఈ గాజులను ధరించడం శుభకరం.. మంగళకరమని భక్తులు భావించి గాజుల కోసం దేవస్థానానికి తరలివస్తారు.  
 
దుర్గమ్మకు 10 లక్షల గాజులు విరాళం 
దుర్గమ్మ అలంకరణ కోసం అవసరమైన మట్టి గాజులను బుధవారం భక్తులు విరాళంగా అందజేశారు. శ్రీకనకదుర్గా లలితా పారాయణ బృందానికి చెందిన గ్రంథి శ్రీరామసుబ్రహ్మణ్యం, రాధిక, ఇతర భక్త బృంద సభ్యులు సుమారు పది లక్షల గాజులను దేవస్థానానికి అందించారు.

గాజులు, పూజాసామగ్రి, పసుపు, కుంకుమతో ఆలయానికి చేరుకున్న భక్త బృందం సభ్యులకు ఆలయ ఈవో ఎంవీ సురేష్‌బాబు, స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్‌శర్మ సాదరంగా స్వాగతం పలికారు. దాతలు అమ్మవారికి గాజులను సమర్పించి ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు.