శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 అక్టోబరు 2019 (14:55 IST)

ఎమ్మెల్యే బాలకృష్ణకు చుక్కలు చూపిన గలిబిపల్లి ఓటర్లు

సినీ నటుడు, హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు అనంతపురం జిల్లా లేపాక్షి మండలంలోని గలిబిపల్లి గ్రామస్థులు చుక్కులు చూపారు. బాలకృష్ణ హిందూపురానికి వస్తున్నారన్న విషయం తెలుసుకుని లేపాక్షి - హిందూపురం ప్రధాన రహదారిపై విద్యార్థులు, గ్రామస్థులు బైఠాయించారు. 
 
లేపాక్షి - హిందూపురం మెయిన్‌రోడ్డు నుంచి గలిబిపల్లికి రోడ్డు వేసేందుకోసం భూమిపూజ చేసి సంవత్సరం కావస్తున్నా పనులు ఇంకా పూర్తికాకపోవడంపై ఎమ్మెల్యే వద్ద గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. 
 
గ్రామస్థుల సమస్యపై స్పందించిన బాలకృష్ణ సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే రోడ్డు పనులు పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్థులు వెనక్కి తగ్గారు. 
 
కాగా, బాలకృష్ణ స్థానిక టీడీపీ అధికార ప్రతినిధి రమేష్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందు కోసం హిందూపురానికి వచ్చారు. హైదరాబాద్ నుంచి విమానంలో బెంగళూరుకు వెళ్లిన బాలకృష్ణ, అక్కడి నుంచి రోడ్డు మార్గాన హిందూపురం చేరుకున్నారు. 
 
ఈ విషయం తెలుసుకున్న గలిబిపల్లి గ్రామస్తులు కొడికొండ చెక్‌పోస్టు నుంచి హిందూపురం వచ్చే రహదారిలో గలిబిపల్లి క్రాస్ వద్ద ఎమ్మెల్యే కారును ఆ గ్రామస్థులు అడ్డుకుని, తమ సమస్యకు పరిష్కారం కనుగొనాలని డిమాండ్ చేశారు. 
 
బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన బాలకృష్ణ వస్తున్న విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు కొడికొండ చెక్‌పోస్టు వద్దకు చేరుకుని భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. మాజీ ఎంపీపీ నాజియా భాను, రాష్ట్ర చంద్రదండు ఉపాధ్యక్షుడు అన్సార్ అహ్మద్, చిలమత్తూరు మండల మాజీ ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు బాలకృష్ణకు ఘన స్వాగతం పలికారు.