ఇంద్రకీలాద్రిపై ముగిసిన దసరా ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ముగిశాయి. యాగశాలలో వేదమంత్రోచరణల మధ్య పూర్ణాహుతితో ఉత్సవాలు ముగిశాయి. పూర్ణాహుతిలో ఈవో సురేష్ బాబు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
శరన్నవరాత్రుల్లో భాగంగా 10వ రోజైన మంగళవారం (ఆశ్వయుజ శుద్ధ దశమి) నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ శ్రీరాజరాజేశ్వరి దేవిగా దర్శనమిచ్చారు.
అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి కనకదుర్గమ్మ అధిష్టానదేవత. శాంతి స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ పసుపు, ఆకుపచ్చ, నీలం, గోధుమ, ఎరుపు రంగుల చీరలు ధరించి చెరకుగడ చేతిలో పట్టుకుని భక్తులకు దుర్గమ్మ దర్శనమిచ్చారు.
ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను భక్తులకు అనుగ్రహించే ఈ శక్తి స్వరూపిణికి పాయసం, చక్రాన్నం, దద్యోజనం, గారెలు, పూర్ణాలు, కదంబం పులిహోర, కేసరి ... ఇలా పదిరకాల రాజభోగాలను నైవేద్యంగా సమర్పించారు.
ఉత్సవాల ముగింపు సందర్భంగా విజయదశమి రోజున సాయం సంధ్యా సమయంలో దుర్గాదేవిని హంస వాహనంపై పవిత్ర కృష్ణా తీరంలో ఊరేగించారు. విద్యుత్తు దీపకాంతులు, మంగళహారతులు, వేదమంత్రాలు, బాణాసంచా వెలుగుల నడుమ అంగరంగ వైభవంగా జరిగే ఈ తెప్పోత్సవాన్ని చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు.