శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 అక్టోబరు 2019 (16:23 IST)

కేసీఆర్ సంచలనం.. పవన్ స్పందన.. ఏమన్నారో తెలుసా?

తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులందరినీ విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ విధించిన గడువు లోపల విధులకు హాజరుకాని సిబ్బందిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోబోమని స్పష్టంచేశారు. ప్రస్తుతం ఆర్టీసీలో ప్రస్తుతం 1200 మంది సిబ్బంది మాత్రమే మిగిలి ఉన్నారని ప్రకటించారు. 
 
దీనిపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పందించారు. తెలంగాణ ఆర్టీసీలో కార్మికుల తొలగింపు నిర్ణయం ఆందోళనకరమని పవన్ అన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం కార్మికులు చేసే ఆందోళనలను ప్రభుత్వాలు సానుభూతితో అర్థం చేసుకుని పరిశీలించాలే తప్ప కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం తగదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.
 
''ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మె సందర్భంగా 1200 మందిని తప్ప మిగతా వారందర్నీ తొలగించనున్నట్లు వస్తున్న వార్తలు కలవరానికి గురి చేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెలో భాగంగా పదిహేడు రోజులపాటు ఆర్టీసీ ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపట్టి ఉద్యమానికి అండగా ఉన్నారు. 
 
వారు చేసిన త్యాగాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి. ప్రజలకు కష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ఉద్యోగుల పట్ల ఉదారత చూపి ఆర్టీసీ సమ్మెను సామరస్యంగా పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌ను కోరుతున్నాను'' అని పవన్‌ పేర్కొన్నారు.