యురేనియం డ్రిల్లింగ్ పనులు జిల్లా కలెక్టర్‌కు తెలియదా?
నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలను జనసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇందుకోసం సేవ్ నల్లమల అనే సోషల్ మీడియా ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అదేసమయంలో కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డలో యురేనియం కోసం డ్రిల్లింగ్ పనులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సర్కారు అనుమతి ఇచ్చింది. గుట్టుచప్పుడు కాకుండా ఈ పనులు సాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. దీనిపై వరుస ట్వీట్స్ చేశారు. ఈ విషయమై ఏపీ ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం వద్ద ఎలాంటి ఆధారాలు లేవా? అని ప్రశ్నించారు. ఈ విషయం గురించి కర్నూలు జిల్లా కలెక్టర్‌కు తెలియకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని అన్నారు.
పైగా, నల్లమల అటవీ ప్రాంతం చుట్టూ ఉన్న ప్రజలకు మద్దతు ఇచ్చేందుకు, వారితో కలిసి పోరాడేందుకు తాము ఉన్నామని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నల్లమల అటవీ ప్రాంత పరిరక్షణ కోసం విమలక్క పాడిన పాట వీడియోతో పాటు యురేనియం డ్రిల్లింగ్ పనులకు సంబంధించిన ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ పాట ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.