శనివారం, 2 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 అక్టోబరు 2020 (15:21 IST)

బెజవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ నుంచి ఊడిపడుతున్న పెచ్చులు...

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన వంతెన బెజవాడ కనకదుర్గ ఫ్లైఓవర్. బెజవాడలో వాహన రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు, జఠిలమైన ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ఈ వంతెనను నిర్మించారు. ఈ వంతెనను గత శుక్రవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఆ తర్వాత వాహన రాకపోకలకు అనుమతించారు. దీంతో విజయవాడ నగర వాహనదారుల కష్టాలు తీరాయని భావించారు. 
 
అయితే, ఈ వంతెన ప్రారంభించిన నాలుగు రోజులు కూడా గడవకముందే స్వల్పంగా దెబ్బతింది. అశోకా పిల్లర్ సమీపంలో ఫ్లైఓవర్ నుంచి కాంక్రీట్ పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో ఫ్లైఓవర్ కింద విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్‌కు గాయాలు అయ్యాయి. 
 
ఏపీఎస్పీ మూడో బెటాలియన్‌(పీసీ 2928)కు చెందిన రాంబాబు దసరా ఉత్సవాల నేపథ్యంలో బందోబస్తు కోసం ఫ్లైఓవర్ కింద విధులు నిర్వహిస్తున్నారు. ఆయనపై ఫ్లైఓవర్ పెచ్చులు ఊడిపడడంతో చేతికి, భుజానికి గాయాలు అయ్యాయి. ఫ్లైఓవర్ ప్రారంభించిన రెండు రోజుల్లోనే ఇలాంటి ఘటన జరగడంతో ఫ్లైఓవర్ పటిష్టతపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 
 
ఉపయోగంలోకి ఇంద్రకీలాద్రి కంఠహారం... 
బెజవాడ వాసులు కళ్లు కాయలు కాసేలా, సుధీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న ఇంద్రకీలాద్రి కనకదుర్గ వారధి గత శుక్రవారం నుంచి ఉపయోగంలోకి వచ్చింది. ఈ వంతెనను కేంద్ర జాతీయ రహదారుల శాఖామంత్రి నితిన్ గడ్కరీ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిలు కలిసి ప్రారంభించారు. ఇంద్రకీలాద్రికి కంఠహారంగా రూపుదిద్దుకున్న ఫ్లై ఓవర్‌ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ జాతికి అంకితం చేశారు.
 
ఈ నెల 16వ తేదీ శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఆన్‌లైన్‌లో గడ్కరీ, జగన్ చూస్తుండగా, ఏపీ రోడ్లు, భవనాల మంత్రి ఎం శంకర నారాయణ లాంఛనంగా వంతెనపైకి రాకపోకలను ప్రారంభించారు. ఇదేకార్యక్రమంలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్ తదితర అధికారులు కూడా పాల్గొంటారు. కాగా, ఈ వంతెనను రూ.501 కోట్లతో నిర్మించారు.