శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (16:06 IST)

ప్రజల ఆరోగ్యం గాలికొదిలేసి, విమర్శలా?: బిజెపి

ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన నిరాధార ఆరోపణలను బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
 
 రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు చేసిన నిరాధార ఆరోపణల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మౌనం వీడాలి.

ఒకవేళ తమ ఎంపీ చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు ఉంటే మీడియా ముఖంగా బహిరంగ పరచాలి. లేనియెడల సదరు ఎంపీ, రాష్ట్ర ముఖ్యమంత్రి బిజెపి రాష్ట్ర శాఖకు, కన్నా లక్ష్మీనారాయణకి, రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
 
రాష్ట్రంలో ప్రజా సమస్యలు, ప్రజల ఆరోగ్యం గాలికొదిలేసిన అధికార పార్టీ... సమస్యలు ప్రశ్నిస్తున్నటువంటి బిజెపిని, బీజేపీ నాయకులను ఎదుర్కోలేక ఈ రకమైన ఆధారరహిత ఆరోపణలకు పాల్పడం మానుకోవాలని హితవు పలికారు. 
 
ప్రజాస్వామ్యంలో ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతున్నప్పుడు ప్రతిపక్షాలకు మాట్లేడే హక్కు ఉంటుందన్న వాస్తవాన్ని తెలుసుకోవాలని, గతంలో కొన్ని పార్టీలు, కొంతమంది నాయకులు ఇలాంటి ప్రజాసమస్యలు పక్కదోవపట్టించే నాటకాలు ఆడి అభాసుపాలైన విషయం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  గుర్తించి ఇలాంటి పనులు మానుకుంటే మంచిదని, లేకుంటే ప్రజలు క్షమించరని ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు. 
 
ప్రజాస్వామ్యంలో ఒకరినొకరు విమర్శించుకునే హక్కు ఉంటుంది కానీ మనం చేసిన విమర్శలకు, ఆరోపణలకు ఆధారాలు చూపెట్టాలి. లేనిపక్షంలో రాష్ట్ర ప్రజలే ప్రజాకోర్టులో వారిని ముద్దాయిలుగా నిలబెడతారని తెలిపారు. 
 
దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణని, అవినీతిని అరోపణలతో ఆయన ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసే చర్యలు చేయడం వల్ల అయనకు ఎమి చేయలేరని, అలాగే ఇతర బిజెపి నేతలపై విమర్శలు చేయడం మూర్ఖత్వపు చర్యవంటిదని విష్ణువర్ధన్ రెడ్డి  పేర్కొన్నారు.