సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 6 ఏప్రియల్ 2020 (21:25 IST)

ప్రధాని సహాయ నిధికి రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబ విరాళం

“ప్రపంచమంతా కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ సమాజంలోని అన్ని వర్గాల వారు స్పందించాల్సిన అవసరం ఉంది” అన్నారు సుప్రసిద్ధ నటులు, నిర్మాత, మాజీ కేంద్ర మంత్రి రెబల్ స్టార్ కృష్ణంరాజు.

ఆయన కుటుంబ సభ్యులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రిలీఫ్ ఫండ్‌కు 10 లక్షల రూపాయల విరాళాన్ని అందజేసిన సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ,  "కరోనా సృష్టించిన విపత్కర పరిస్థితులను అధిగమించటానికి డాక్టర్లు, నర్సులు , పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, మీడియా ఇంకా అనేక శాఖల వారు అహర్నిశలు శ్రమిస్తున్నారు. 
 
వారి త్యాగం, కష్టం వెలకట్టలేనివి. అందుకే ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ స్పందిస్తూ తమ శక్తి మేరకు విరాళాలు అందజేస్తున్నారు. మా కుటుంబం నుండి మా పెద్దమ్మాయి సాయి ప్రసీద, రెండవ అమ్మాయి సాయి ప్రకీర్తి, మూడవ అమ్మాయి సాయి ప్రదీప్తి తాము దాచుకున్న పాకెట్ మనీ నుండి తలా రెండు లక్షలు చొప్పున ప్రధాని రిలీఫ్ ఫండ్ కు ఇస్తామని ముందుకు వచ్చారు. అలాగే నా శ్రీమతి శ్యామలా దేవి ఏప్రిల్ 13న తన జన్మదిన సందర్భంగా నాలుగు లక్షల రూపాయలను ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్‌కు ఇస్తానని చెప్పింది. 
 
కాబట్టి మొత్తం 10 లక్షల విరాళాన్ని ఈరోజు ప్రధానమంత్రి సహాయనిధికి పంపించడం జరిగింది. కేవలం ఆర్థిక సహకారమే కాకుండా ఈ కరోనా విపత్తును అధిగమించడానికి మన ప్రియతమ ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు మార్చి 22న జనతా కర్ఫ్యూ విజయానికి సంకేతంగా చప్పట్లు కొట్టడం, నిన్న ఏప్రిల్ 5న కొవ్వొత్తులు వెలిగించి మద్దతు ప్రకటించడం వంటి విషయాలలో కూడా ప్రతి ఒక్కరూ ముందుండాలని కోరుకుంటున్నాను. మా కుటుంబం మొత్తం ఈ పోరాటంలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది ” అన్నారు.