బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 16 డిశెంబరు 2022 (09:47 IST)

ఈ రాష్ట్రంలో పుట్టడం కంటే పక్క వేరే రాష్ట్రాల్లో పుట్టినా బాగుండేది.. బ్రదర్ అనిల్

brother anil
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఆయన బావ, వైఎస్.షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ సుతిమెత్తని విమర్శలు చేశారు. జగన్ పేరు ఎక్కడా ప్రస్తావించకుండా విమర్శలు గుప్పించారు. ఈ రాష్ట్రం(ఏపీ)లో పుట్టడం కంటే ఇతర రాష్ట్రాల్లో పుట్టినా బాగుండేదని ప్రజలు అనుకుంటున్నారంటూ వ్యాఖ్యలు చేసి పెద్ద చర్చకు దారితీశారు. 
 
క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని విశాఖపట్టణం జిల్లా భీమిలి మండలంలోని క్రైస్ట్ కేర్ అండ్ క్యూర్ మినిస్ట్రీ‌‍లో గురువారం జరిగిన సామూహిక ప్రార్థన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేవుడి పథకాలు వేరే విధంగా ఉంటాయని, ప్రభుత్వ పథకాలపై ఆధారపడొద్దంటూ సూచించారు. 
 
ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రాల్లో పుట్టినా బాగుండేదని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. తమ స్వార్థం కోసం ప్రభుత్వం ఇచ్చే పథకాలపై ఆధారపడొద్దని ప్రజలకు సూచించారు. దేవుడి పథకాలు వేరేగా ఉంటాయని అన్నారు. 
 
ఏపీలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఆయన పరోక్ష విమర్శలు చేసినప్పటికీ బ్రదర్ అనిల్ కుమార్ తన ప్రసంగంలో ఎక్కడా కూడా ముఖ్యమంత్రి జగన్ పేరు లేదా వైకాపా పేరును ప్రస్తావించలేదు. గత యేడాది కూడా ఆయన ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.