ఎంపీ వంగా గీతకు బి.ఎస్.ఎన్.ఎల్ పెన్షనర్ల కితాబు
టెలికమ్యూనికేషన్ శాఖ ఉద్యోగుల పెన్షన్ రివిజన్ పైన పార్లమెంటులో స్పందించిన కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్‌కు ఆల్ ఇండియా బియస్యన్యల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది. బి.ఎస్.ఎన్.ఎల్ పెన్షనర్ల పెన్షన్ రివిజన్ ఇష్యూని పార్లమెంట్ జీరో అవర్లో ప్రస్తావించిన ఎంపీకీ బి.ఎస్.ఎన్.ఎల్ సర్కిల్ కార్యదర్శి వల్లభజోస్యుల వర ప్రసాద్ అభినందనలు తెలిపారు.
తమ పెన్షనర్ల సమస్యలను ప్రొజెక్ట్ చేయడంలో ఎంపీ గీత ఎంతో శ్రద్ధ చూపిస్తున్నారని, లక్షలాది మంది బి.ఎస్.ఎన్.ఎల్ ఉద్యోగుల సమస్య పరిష్కారానికి ఎంపీ తదుపరి ప్రయత్నం కొనసాగిస్తారని ఆశిస్తున్నామని ప్రసాద్ చెప్పారు. రెండున్నర లక్షల మంది పెన్షనర్లను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం నుంచి బి.ఎస్.ఎన్.ఎల్. లో విలీనం చేశారని, వీరికి పెన్షన్ రివిజన్ ఇంత వరకు జరగలేదని తెలిపారు.
సిసిఎస్ పెన్షన్ 2021 నిబంధనల కింద, బి.ఎస్.ఎన్.ఎల్ ఆర్ధిక స్థితితో సంబంధం లేకుండా ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వాలని, దురదృష్టవశాత్తు పేరివిజన్‌తో పెన్షన్ రివిజన్‌ని లింక్ చేయడం తగదని తెలిపారు. ఉద్యోగులు డ్యూటీలో ఉండగా, బిఎస్ఎన్ఎల్ కిందకు వస్తారని, రిటైర్ అయిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ కిందకు వస్తారని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా వారికి కమ్యుటేషన్, రిటైర్మెంట్ గ్రాట్యూటీ అందించాలని, బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల పెన్షన్ రివిజన్ 2007లో నిర్వహించారని, అప్పటి నుంచి పెండింగ్ పడిపోయిందన్నారు. ఏడవ సిపిసి సిఫార్సుల ప్రకారం 32 శాతం వెయిటేజీతో పెన్షన్ రివిజన్ జరగాలని ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండు చేస్తోంది. దీనిపై పోరాటం చేస్తున్నట్లు సర్కిల్ కార్యదర్శి వల్లభజోస్యుల వరప్రసాద్ తెలిపారు.