ఇవాళ నా కొడుకు నాకన్నా గొప్పగా చెప్పిన తీరుకు నేను మురిసిపోతున్నానన్నాడు పరమశివుడు
మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామివారికి ఎంతో ప్రీతికరం. ఆ రోజున స్వామివారికి అరటిపండ్లు, పటిక బెల్లం వంటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. స్వామివారికి అభిషేకాలు చేయడం వలన సర్ప దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. దాంతో సంతానం లేనివారు సుబ్రహ్మణ్య స్వామికి నియమనిష్టలతో ఆరాధించడం వలన సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మకం.
సుబ్రహ్మణ్యునికి వేదమంటే ఎంతో ఇష్టం. వేదమన్నా, వేదాన్ని అర్ధవంతంగా బాగా చదువుకున్న విధ్వాంసులన్నా సుబ్రహ్మణ్యునికి విశేషమైన ప్రీతి. వేద విధ్వాంసులను సత్కరించినా, గౌరవించినా, సుబ్రహ్మణ్యుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు. అందుకే నాదాన్ని వింటే అపరిమితమైన ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధన చేస్తే పార్వతీపరమేశ్వరులు వినాయకుడు కూడా ఎనలేని ప్రీతి పొందుతారు. ఎందుకంటే వారిద్దరి అపారమైన కోరికలను తీర్చినవాడు సుబ్రహ్మణ్యుడే. ఆయనను మించిన విధ్వాంసుడు లోకంలో ఇంకొకరు లేరు.
నటరాజస్వామిగా ఆయన సమస్త విద్యలకు ఆలవాలం. చేతిలో ఢమరుకం పట్టుకుంటాడు. అందులోంచే మహేశ్వర సూత్రాలు, వ్యాకరణం, శబ్దరాశి వచ్చాయి. సమస్త విద్యలూ పరమశివుని ఆధీనమై ఉంటాయి. అటువంటి పరమశివునికి ఒక కోరిక ఉండేది. నాకొక అపురూపమైన సత్కారం జరగాలి. ఏమిటా సత్కారం-పుత్రాదిచ్చేత్ పరాజయం- ఒక మహా విధ్వాంసుడైన తండ్రికి జరగాల్సిన సత్కారమేమంటే తన కొడుకు చేతిలో ఓడిపోవడం. తన కన్న కొడుకు చేతిలో తాను ఓడిపోతే అబ్బా ఇదిరా సత్కారం... అని పరవశించిపోతాడట. తండ్రికన్నా అధికుడైనవాడు పుడితే ఆయన చేతిలో మరణిస్తానన్నాడు- శూర పద్మాసురుడు.
అందుకే ప్రణవానికి రహస్యం. ప్రణవ విశేషం చెప్పవలసివస్తే స్వామినాధన్‌గా వెలసిన క్షేత్రంలో తండ్రి అయిన పరమశివుణ్ణి పిలిపించి, నాన్నగారు.. చెప్పవలసినవాడు పైనుండాలి. వినవలసిన వాడు కిందుండాలని తండ్రిని కింద కూర్చోబెట్టి , ప్రణవ రహస్యాన్ని చెప్పాడు స్వామి. అబ్బ.. నేను చెప్పిన దానికన్నా గొప్పగా చెప్పాడురా.. ఇవాళ నా కొడుకు పొందిన జ్ఞానానికీ, నాకన్నా గొప్పగా చెప్పిన తీరుకూ నేను మురిసిపోతున్నానన్నాడు పరమశివుడు. కాబట్టి పరమ శివుణ్ణి సంతోషపెట్టిన మూర్తి సుబ్రహ్మణ్యుడు.
ఇక ఆయన శక్తి అంతా అమ్మవారే.. ఆయన రూపమంతా అమ్మవారే. ఆయన మంత్రం ఆరక్షరాలతో అమ్మవారే. ఆయన పుట్టింది అమ్మవారి శరీర రూపమైన శరవణతటాకం లోంచే. ఇన్ని అమ్మవారి పోలికలు కలిసి ఉన్న కారణం చేత , పార్వతీదేవికి ఎనలేని ప్రీతిపాత్రుడు. అందుకే పార్వతీపరమేశ్వరులు కూర్చొని ఉంటే, ఎప్పుడూ అమ్మవారి తొడమీద కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు. అలాంటి సుబ్రహ్మణ్యునికి నమస్కరించినా, రెండు పువ్వులు అర్పించినా, సుబ్రహ్మణ్య నామం చెప్పినా, దేవాలయానికి వెళ్ళినా, ప్రదక్షిణం చేసినా ఆయన విశేషమైన అనుగ్రహాన్ని వర్షిస్తాడు. అంత గొప్ప స్వరూపం శ్రీ సుబ్రహ్మణ్యస్వామిది.