శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (19:30 IST)

కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్... ఏంటది?

‘‘ఈ బడ్జెట్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయింపులు జరపలేదు. అయినా మన సమర్థత చూపి శాఖాపర కేటాయింపులలో రాష్ట్రానికి ఎక్కువ నిధులు రాబట్టుకోవాలి’’ అని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోమవారం తన నివాసం నుంచి నీరు-ప్రగతి

‘‘ఈ బడ్జెట్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయింపులు జరపలేదు. అయినా మన సమర్థత చూపి శాఖాపర కేటాయింపులలో రాష్ట్రానికి ఎక్కువ నిధులు రాబట్టుకోవాలి’’ అని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోమవారం తన నివాసం నుంచి నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్ ద్వారా ఏ శాఖకు ఎన్ని నిధులు వచ్చే అవకాశం ఉందో అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. గరిష్టంగా కేంద్రం నుంచి ఎంత తెచ్చుకోవచ్చో అనేదానిపై శాఖాపరంగా కార్యాచరణ సిద్ధం చేయాలని, అమలు చేయాలని కోరారు.
 
నరేగా నిధులు రూ.7 వేల కోట్లు వినియోగించుకోవాలి:
నరేగాకు ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో రూ.55 వేల కోట్లు పెట్టినప్పటికీ, సప్లిమెంట్‌గా మరో రూ.10 వేల కోట్లు కలిపి రూ.65 వేల కోట్ల బడ్జెట్ అందుబాటులో ఉంటుందని అధికారులు వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ ఈ ఏడాది నరేగా నిధులు రూ.7 వేల కోట్లు మన రాష్ట్రం వినియోగించుకోవాలని సూచించారు. నరేగా పనిదినాల సంఖ్య 23 కోట్లకు చేరుకోవాలన్నారు. ఉపాది కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించాలని, మెటీరియల్ కాంపొనెంట్ నిధుల వినియోగం 40% మించకుండా చూడాలని, లేబర్ కాంపోనెంట్ పెంచుకోవాలని దిశానిర్దేశం చేశారు. వాటర్ షెడ్స్ రెండవ దశ పనులు మార్చి నెలాఖరుకల్లా పూర్తి చేయాలన్నారు.
 
రూ.10 వేల కోట్లలో ఎక్కువ ఏపికే రాబట్టాలి:
ఈ బడ్జెట్లో క్షీర విప్లవం, నీలి విప్లవానికి రూ.10 వేల కోట్లు పైబడి కేటాయించిన అంశం ప్రస్తావించి, ఈ నిధులను రాష్ట్రంలోని ఆక్వా రైతాంగం, పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మత్స్య రంగం, పశు సంవర్థక రంగంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుకు ఈ నిధులు వినియోగించుకోవాలన్నారు.  అన్ని జిల్లాలు పశుగ్రాసం సాగుపై దృష్టి పెట్టాలని, వేసవిలో పశుగ్రాసం కొరత లేకుండా చూడాలని ఆదేశించారు.
 
మత్స్యశాఖను కూడా నరేగాకు అనుసంధానం చేసిన విషయం ప్రస్తావించి తీరప్రాంతం అధికంగా ఉన్న మన రాష్ట్రం దీనిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామాలలో పంటకుంటలతో పాటు చేపల కుంటలకు కూడా నరేగా పథకాన్ని వినియోగించుకోవాలని, రైతుల ఆదాయాలు పెంచుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
 
ఒక స్థాయికి చేరుకున్నాం-ఇకపై నిలకడ సాధించాలి: ‘‘మూడున్నరేళ్లలో అనేక పనులు చేశాం. ఈ ఏడాది పనులలో స్థిరీకరణ రావాలి, సంతృప్తం కావాలి. ఇప్పుడు మనం ఒక స్థాయికి చేరుకున్నాం, ఇకపై నిలకడ సాధించాలి’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాబోయే ఖరీఫ్‌లో ఏ పంటలు సాగుచేయాలో ఇప్పటినుంచే దృష్టి పెట్టాలని, మేలు రకాలు సాగుచేయాలని, ఉత్పాదకత పెరగాలని, సాగు వ్యయం తగ్గాలని తద్వారా రైతుల నిజ ఆదాయాలు పెంచాలని కోరారు.

మద్దతు ధరలపై కేంద్రం చేపట్టే విధానం వల్ల వరి ధరల్లో పెరుగుదల పెద్దగా ఉండకపోవచ్చని, పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుందని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి రాజశేఖర్ పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ రాబోయే సీజన్‌లో ఏ పంటలు సాగుచేస్తే ధరలు బాగుంటాయో అనే దానిపై రైతుల్లో ఇప్పటినుంచే అవగాహన పెంచాలన్నారు. గత రెండేళ్లలో వర్షపాతం లోటు తీవ్రంగా ఉన్నా జలసంరక్షణ చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయన్నారు. ఇన్‌పుట్ సబ్సిడి, పంటల బీమా 95% పంపిణీ పూర్తయ్యిందని తెలిపారు. సూక్ష్మపోషకాలు ఉచితంగా అందించడం వల్ల భూసారం పెరిగిందని, రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలని, ప్రకృతి సేద్యాన్ని మరింత ప్రోత్సహించాలని కోరారు.
 
పెండింగ్ ఇళ్ల నిర్మాణం వెంటనే పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ 2016-17లో 56% మాత్రమే పూర్తిచేశారని, 2017-18,2018-19 ఇళ్ల పనులు వెంటనే ప్రారంభం అయ్యేలా శ్రద్ధ వహించాలని కోరారు. ఎన్టీఆర్ గ్రామీణ్ లక్ష్యాలను చేరుకోవాలన్నారు. హుద్‌హుద్ తుపాన్ బాధిత కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం ఇంకా పూర్తిచేయక పోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.