శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 15 ఫిబ్రవరి 2020 (14:01 IST)

ఆ ఇళ్లను ఎందుకు నిలిపివేశారో చెప్పగలరా?: జగన్​కు టీడీపీ ఎమ్మెల్యే బహిరంగ లేఖ

సీఎం జగన్​కు ప్రకాశం జిల్లా పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు లేఖ రాశారు. ఇళ్ల స్థలాల పేరుతో పేదల నుంచి బలవంతంగా భూములు లాక్కోవడాన్ని తీవ్రంగా ఖండించారు.

గత ప్రభుత్వ హయాంలో పేదల కోసం ప్రారంభించిన 9 లక్షల గృహ నిర్మాణాలను అర్ధాంతరంగా నిలిపివేశారని ప్రశ్నించారు. పేదల పొట్టకొట్టి వైసీపీకి చెందిన ధనవంతుల జేబులు నింపాలనేలా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని... ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఆరోపించారు.

ముఖ్యమంత్రి జగన్‌కు బహిరంగ లేఖ రాసిన ఆయన... ఇళ్ల స్థలాల పేరుతో నిరుపేదల నుంచి బలవంతంగా భూములు లాక్కోవడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు. దశాబ్దాల క్రితం ప్రభుత్వాలు ఇచ్చిన భూములకు సరైన పత్రాలు లేవంటూ భూములు లాక్కోవడం సిగ్గుచేటని విమర్శించారు.

25 లక్షల మందికి ఇళ్ల పట్టాల పేరుతో ముఖ్యమంత్రి బోగస్‌ ప్రచారం చేస్తూ పేదలను మోసం చేస్తున్నారని ఆయన లేఖలో ఆరోపించారు.

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలు సుమారు 20 లక్షలకు పైగా స్థలాలను మంజూరు చేశాయన్న ఆయన... వాటన్నింటినీ అడ్డగోలుగా రద్దు చేసి పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామనడం వంచన కాదా అని జగన్‌ను ప్రశ్నించారు.

గత ప్రభుత్వ హయాంలో పేదల కోసం ప్రారంభించిన 9 లక్షల గృహ నిర్మాణాలను అర్ధాంతరంగా నిలిపివేశారని మండిపడ్డారు. కేటాయింపులు జరిగిపోయిన వారిని కూడా అనర్హులుగా గుర్తించడం ద్రోహమని దుయ్యబట్టారు.

తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను ఎందుకు అర్ధాంతరంగా నిలిపివేశారో ప్రజలకు చెప్పగలరా అంటూ నిలదీశారు. 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటే సుమారు 10 వేల ఎకరాల భూములను కొనుగోలు చేయాలని తెలిపారు.

కానీ ఈ 8 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు 100 ఎకరాల చొప్పున కూడా కొనుగోలు చేయలేదని ఆరోపించారు.