శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: మంగళవారం, 23 మార్చి 2021 (22:44 IST)

ఇసుక కాంట్రాక్ట్‌ను రద్దు చేయండి: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

విజ‌య‌వాడ‌‌: రాష్ట్రంలో ఇసుక త్రవ్వకాలకై జెపి పవర్ వెంచర్స్ కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్ట్ ను తక్షణమే రద్దు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయ‌న మంగ‌ళ‌వారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా రామ‌కృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో ఇసుక కష్టాలు కొనసాగాయి.

నూతన ఇసుక పాలసీ, ఆన్ లైన్ లో ఇసుక, ముగ్గురు మంత్రులతో కమిటీ అంటూ గత రెండేళ్లుగా నిర్మాణదారులకు ఇసుక దొరకకుండా కొరత సృష్టించిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. ఫలితంగా రాష్ట్రంలో భవన నిర్మాణరంగం సంక్షోభంలోకి నెట్టబడింది. 30 లక్షలకు పైగా భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి వీధుల పాలయ్యారు.

ఇప్పుడు ఇసుక త్రవ్వకాల కాంట్రాక్టును నష్టాల్లో ఉన్న జయప్రకాశ్ వెంచర్స్ అనే ప్రైవేటు కంపెనీకి అప్పగించారు. ప్రైవేటు కంపెనీకి అప్పగించగానే ఇసుక టన్నుకు రు. 100లు అదనంగా పెంచారు. ఈ కంపెనీ జగన్మోహనరెడ్డికి బినామీ కంపెనీ అనే ప్రచారం గుప్పుమంటోంది. కేవలం రు. 54 కోట్ల లాభం కోసం జెపి వెంచర్స్ కంపెనీ రాష్ట్రంలో ఇసుక త్రవ్వకాలకు, రీచ్ నిర్వహణకు సిద్ధమైందని చెప్పడం హాస్యాస్పదం.

అయినా ఇసుక రీచ్లన్నీ ఒకే కంపెనీకి ఎలా వచ్చాయో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంది. మద్యపాన నియంత్రణ చేస్తామంటూ అధికారంలోకొచ్చి, రాష్ట్రంలో టోకుగా మద్యం అమ్మించే వ్యాపారం కూడా ముఖ్యమంత్రే తీసుకున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కొత్త బ్రాండ్ల పేరుతో మద్యం కంపెనీలు స్థాపించి, అమ్మిస్తున్న ఘనత కూడా జగన్మోహనరెడ్డికే దక్కుతుంది.

అదే విధంగా గత రెండేళ్లుగా ఇసుక కొరత సృష్టించి ఇప్పుడు ఇసుక కాంట్రాక్టును బినామీ కంపెనీలకు అప్పగించి, మొత్తం టోకు వ్యాపారానికి సిద్ధమయ్యారు. సిమెంట్ కంపెనీలను నియంత్రణ చేస్తున్నారు. రాష్ట్రంలో ఆర్ & బి, పంచాయితీరాజ్, ఇరిగేషన్ టెండర్లన్నింటినీ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ప్రతి మనిషికీ ఆశకు, ధనదాహానికి అంతుంటుంది. అంతులేని ధనదాహంతో ముఖ్యమంత్రి లాభాలార్జించే అన్ని రంగాలలో బినామీ వ్యవస్థను చొప్పిస్తున్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే జెపి పవర్ వెంచరకు కట్టబెట్టిన ఇసుక కాంట్రాక్ట్ ను రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.