బుధవారం, 11 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 ఏప్రియల్ 2023 (17:52 IST)

వివేకా హత్య కేసు : ఆ ఇద్దరి వద్ద ఆరు గంటల పాటు విచారణ

bhaskar - uday kumar
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్టు అయిన వై.ఎస్‌.భాస్కర్‌ రెడ్డి, ఉదయ్‌ కుమార్‌ రెడ్డిల వద్ద సీబీఐ అధికారులు నాలుగో రోజు విచారణ పూర్తి చేశారు. శనివారం ఉదయం 9 గంటల సమయంలో చంచల్‌గూడ జైలుకు చేరుకున్న అధికారులు ప్రత్యేక వాహనంలో వారిని సీబీఐ కార్యాలయానికి తీసుకొచ్చారు. దాదాపు 6 గంటల పాటు ప్రశ్నించారు. హత్య జరిగిన రోజు, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై వీరిద్దరినీ గుచ్చిగుచ్చి ప్రశ్నించినట్లు సమాచారం. 
 
ఇంకా మరో రెండు రోజుల పాటు కస్టడీ గడువు ఉండటంతో మరిన్ని వివరాలు రాబట్టే అవకాశం ఉంది. మరోవైపు ఇదే కేసులో కడప ఎంపీ అవినాష్‌ రెడ్డిని కూడా సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. విచారణ అనంతరం భాస్కర్‌ రెడ్డి, ఉదయ్‌ కుమార్‌ రెడ్డిలను తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు.  శుక్రవారం విచారణకు హాజరైన అవినాష్‌ రెడ్డితోపాటు వైస్‌ఎస్‌ భాస్కర్‌ రెడ్డి, ఉదయ్‌ కుమార్‌ రెడ్డిలను అధికారులు రెండు గదుల్లో ఉంచి ప్రశ్నించారు. 
 
భాస్కరరెడ్డి సమక్షంలో ఉదయ్‌ కుమార్‌ రెడ్డిని అనేక ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ముఖ్యంగా వివేకానంద రెడ్డి, భాస్కర రెడ్డి కుటుంబాల మధ్య ఉన్న సంబంధాలపై, 2017 ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు. ఈ ఎన్నికల్లో తాను ఓడిపోవడానికి భాస్కరరెడ్డే కారణమని భావిస్తూ వివేకానందరెడ్డి వారిపై ఆగ్రహం వెలిబుచ్చినట్లు జరిగిన ప్రచారంపై ఉదయ్‌ కుమార్‌ రెడ్డిని అడిగారు. ఇరు కుటుంబాల మధ్య నెలకొన్న స్పర్థలు, వాటికి గల కారణాలపై సీబీఐ అధికారులు ప్రశ్నించారు. 
 
అసలు వివేకాను హత్య చేయాలన్నంత పగ ఎవరికి ఉంటుందని ప్రశ్నించారు. వీటిలో చాలా వాటికి సమాధానం తెలియదనే ఉదయ్‌ కుమార్‌ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. భాస్కర రెడ్డిని కూడా వీటికి సంబంధించిన అంశాలనే అడిగినట్లు, వివేకాకు, ఆయనను హత్య చేసిన వారి మధ్య ఉన్న కక్షలు, వాటికి కారణాలపై విచారించారు. భాస్కర్ రెడ్డికి వెన్నునొప్పి కారణంగా మధ్యాహ్నం కొద్దిసేపు విశ్రాంతి ఇచ్చి మళ్లీ విచారణ కొనసాగించారు.