వైఎస్ వివేకా హత్య కేసు : రెండో రోజు విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి రెండోరోజైన గురువారం సీబీఐ అధికారుల ఎదుట హాజరయ్యారు. హైదరాబాద్ నగరంలోని కోఠిలో ఉన్న సీబీఐ కార్యాలయానికి ఆయన గురువారం ఉదయమే చేరుకున్నారు. ఈ విచారణలో భాగంగా తొలి రోజు అయిన బుధవారం నాడు అవినాష్ రెడ్డి వద్ద సీబీఐ అధికారులు సుధీర్ఘంగా ఎనిమిది నుంచి తొమ్మిది గంటల పాటు విచారించారు.
వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు జరిగిన పరిణామాలపై ఆరా తీశారు. నిందితులతో జరిపిన ఆర్థిక లావాదేవీలపై ఎంపీని సీబీఐ అధికారులు అనేక రకాలుగా ప్రశ్నించారు. ముఖ్యంగా రూ.40 కోట్ల డీల్‌కు సంబంధించి అవినాష్ రెడ్డి పాత్రపై ఆరా తీశారు. సహజ మరణంగా ఎందుకు చిత్రీకరించారంటూ సీబీఐ నిలదీసింది.
మరోవైపు, సీబీఐ కొత్త ఆఫీసర్ వికాస్ సింగ్‌కు అవినాష్ రెడ్డి లేఖ రాశారు. వైఎస్ వివేకా హత్య జరిగిన రోజున దొరికిన లేఖపై దర్యాప్తు జరపాలని కోరారు. వికేకా ఫోనులో ఉన్న వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వివేకా అల్లుడైన రాజశేఖర్‌ను ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.