గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ప్రయాణ జాప్యంపై పోలీసులకు చంద్రబాబు ప్రశ్న?

cbn convoy
స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్‌పై విడుదలైన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత ఆయన ఏపీ హైకోర్టు విధించిన షరతులకు లోబడి రాజమండ్రి నుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో కారులో బయలుదేరారు. అయితే, ఆయన కాన్వాయ్ దాదాపు 14.30 గంటల పాటు సుధీర్ఘంగా కొనసాగింది. తన ప్రయాణ జాప్యంపై పోలీసులను చంద్రబాబు ప్రశ్నించారు. కోర్టు నిబంధనల మేరకు ప్రయాణిస్తున్నా ఎందుకు జాప్యమైందంటూ నిలదీశారు. 
 
అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో జాప్యమవుతోందని పోలీసులు వివరణ ఇచ్చారు. వారిని ఒత్తిడి చేస్తే శాంతిభద్రతల సమస్య వస్తుందని చంద్రబాబుకు తెలిపారు. ప్రజలను, వాహనాలను నిదానంగా క్లియర్ చేస్తున్నామన్నారు. చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి తన కాన్వాయ్‌లో మంగళవారం 4.40 గంటలకు బయలు దేరారు. తమ అభిమాన నేతను చూసేందుకు ఎక్కడికక్కడ ప్రజలు రోడ్లపైకి వచ్చి పూలు చల్లుతూ స్వాగతం పలుకుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఇప్పటికే చంద్రబాబు ప్రయాణం 14 గంటలకు పైగా పట్టింది. చంద్రబాబు కాన్వాయ్ అర్థరాత్రి దాటిన తర్వాత 3.30 గంటల సమయంలో విజయవాడ నగరంలోకి ప్రవేశించింది. తెదేపా అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. 
 
మరోవైపు చంద్రబాబు ప్రయాణ విషయంపై విజయవాడ సీపీ కాంతి రాణా టాటాకు ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సందేశం పంపారు. కోర్టు నిబంధనలకు లోబడే చంద్రబాబు ప్రయాణిస్తున్నారని సీపీకి స్పష్టం చేశారు. చంద్రబాబు ఎక్కడా రాజకీయ యాత్ర చేపట్టలేదని వివరణ ఇచ్చారు. వేలాదిగా ప్రజలు తరలివస్తున్నా ఆయన ఎక్కడా వాహనం దిగలేదని చెప్పారు. చంద్రబాబు కాన్వాయ్ వెంట వేరే వాహనాలను అనుమతించొద్దని సీపీకి తెలిపినట్లు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.