ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 13 సెప్టెంబరు 2023 (11:54 IST)

కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య... 25కు చేరిన మొత్తం మృతులు

రాజస్థాన్ రాష్ట్రంలోని కోటాలో వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుంటూ మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. దీంతో కలుపుకుని ఈ యేడాది ఇప్పటివరకు ఇక్కడ ప్రాణాలు తీసుకున్న వారి సంఖ్య 25కు చేరింది. తాజాగా నీట్ కోసం శిక్షణ తీసుకుంటున్న 16 ఏళ్ల బాలిక తాజాగా ఉరివేసుకుంది. మృతురాలిని బీహార్ రాష్ట్రంలోని రాంచీకి చెందిన విద్యార్థినిగా గుర్తించారు. ఈమె నగరంలోని బ్లేజ్ హాస్టల్లో ఉంటూ నీట్‌కు శిక్షణ పొందుతోంది.
 
రాజస్థాన్ పోలీసులు చెబుతున్న దానిని బట్టి 2022లో 15 మంది, 2019లో 18 మంది, 2018లో 20 మంది, 2017లో ఏడుగురు, 2016లో 17 మంది, 2015లో 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే, కరోనా కారణంగా కోచింగ్ సెంటర్లు మూతపడడంతో 2020, 21లో ఒక్క విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకోలేదు.
 
కోటాలోని ట్రైనింగ్ కేంద్రాల్లో జేఈఈ, నీటు శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఒత్తిడి కారణంగానే ప్రాణాలు తీసుకుంటున్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో హాస్టల్ రూములు, విద్యార్థులు ఉండే పేయింగ్ గెస్ట్ నివాసాల్లో సీలింగ్ ఫ్యాన్లను తొలగించాలని ఆదేశించారు. ఆత్మహత్యల నివారణకు విద్యార్థులకు మానసిక ఆలంబన, భద్రత కల్పించాలని కూడా కోటా జిల్లా కలెక్టర్ ఓం ప్రకాశ్ బంకర్ ఆదేశించారు.
 
కోటాలో విద్యార్థుల మరణాలు ఆపేందుకు ప్రతిపాదనలు సూచించాలని రాజస్థాన్ హైకోర్టు ప్రభుత్వాన్ని కోరింది. విద్యార్థుల మానసిక కౌన్సెలింగ్‌పై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను కోర్టు నొక్కి చెప్పింది. కోచింగ్ సెంటర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రాజస్థాన్ కోచింగ్ ఇనిస్టిట్యూట్ (కంట్రోల్ అండ్ రెగ్యులైజేషన్) బిల్లు 2023ని ప్రవేశపెట్టడాన్ని పరిశీలిస్తోంది.