సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Updated : మంగళవారం, 11 జూన్ 2019 (19:34 IST)

చంద్రబాబుకు ఆ భయం పట్టుకుందట...?

అధికారం మీద మోజు లేదు.. ప్రతిపక్షం కొత్తా కాదు. ఆరోపణలకు కంగారు పడింది లేదు. కేసులంటే భయపడిందీ లేదు. ఒకటా..రెండా.. 40 యేళ్ళ ఇండస్ట్రీ ఇక్కడ. నిన్న మొన్నటి దాకా చంద్రబాబు గురించి పార్టీ క్యాడర్ గొప్పగా చెప్పుకునేది. అలాంటి చంద్రబాబుకు ఇప్పుడు ఆ భయం పట్టుకుందా అన్న గుసగుసలు తెలుగు తమ్ముళ్ళ మధ్యే వినిపిస్తున్నాయట. జగన్ సర్కార్‌తో ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్న చంద్రబాబును నిజంగానే టెన్షన్ వెంటాడుతోందా?
 
ఆవేశంలో చంద్రబాబు, ఆత్మవిశ్వాసంతో చంద్రబాబు.. సరదాగా చంద్రబాబు... సమరోత్సాహంతో చంద్రబాబు.. ఇలా చంద్రబాబు చాలా సందర్భాల్లో చాలా రకాలుగా కనిపించారు. కానీ ఈనెల 7వ తేదీన గవర్నర్ నరసింహన్‌ను కలిశారు చంద్రబాబు. చంద్రబాబు గవర్నర్‌ను కలిసినప్పుడు గవర్నర్ మాత్రం ఠీవీగా కూర్చున్నారు. చంద్రబాబు మాత్రం కాన్ఫిడెంట్‌గా కూర్చోలేదనే వాదన తిరుగుతోంది. 
 
అదేసమయంలో చంద్రబాబు రిలాక్స్‌గా కూడా కనిపించడం లేదనీ, టెన్షన్.. టెన్షన్‌గా కనిపించారనీ, ఆ టెన్షన్ కేసులకు సంబంధించిందేనా అన్న ప్రశ్న అటు టిడిపితో పాటు ఇటు రాజకీయ వర్గాల్లోను హల్చల్ చేస్తోందట. అటు చూస్తే కేంద్రంలో మోడీ సర్కార్ ఇటు చూస్తే రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం. ఇద్దరూ కూడా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తిరుపతి సభలో ప్రధాని మాట్లాడుతూ... కొందరు ఎన్నికల ఫలితాల ప్రభావం నుంచి ఇంకా తేరుకోలేదు. అది వారి బలహీనత అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి.
 
చంద్రబాబును ఉద్దేశించి మోడీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అన్న విషయం పొలిటికల్‌గా చర్చ సాగుతోందట. మరోవైపు కొత్తగా కేసులు ఎదుర్కోక తప్పదా అన్న ఆందోళన చంద్రబాబులో పెరుగుతోందన్న ప్రచారం మరోవైపు ఉంది. సిఎంగా ఉన్నవేళ మోడీ, జగన్, కెసిఆర్‌లు మాత్రమే కాదు గవర్నర్ నరసింహన్ పైన కూడా ఒకస్థాయిలో విరుచుకుపడ్డారు చంద్రబాబు. విమర్సలు కూడా చేశారు.
 
కొన్ని సంధర్భాల్లో అగ్రెసివ్‌గా గవర్నర్ విషయంలోను వ్యవహరించారు. ఇప్పుడు మోడీతో ఢీ అంటే ఢీ అన్న పరిస్థితిలో చంద్రబాబు లేరని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో మోడీతో ఏర్పడిన గ్యాప్‌ను తగ్గించుకునేందుకు చంద్రబాబు గవర్నర్ సాయం తీసుకుంటారా అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోందట. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.