1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2023 (08:42 IST)

నేడు చంద్రబాబు పిటిషన్లపై తీర్పులు.. సర్వత్రా ఉత్కంఠ

chandrababu
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసుకున్న పలు పిటిషన్లపై సోమవారం తీర్పులు వెలువడనున్నాయి. అలాగే, ఈ కేసును కొట్టి వేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసి క్వాష్ పిటిషన్‌పై కూడా నేడు విచారణ జరుగనుంది. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని చంద్రబాబు తన క్వాష్ పిటిషనులో పేర్కొన్నారు. 
 
ఇటీవల ఈ పిటిషన్‌లో వాదనలు విన్న జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. దాంతో, సుప్రీంకోర్టులో సోమవారం నాటి విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
 
మరోవైపు, ఈ కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పైనా, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లపైనా విజయవాడ ఏసీబీ కోర్టులో ఇప్పటికే వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్లపై తీర్పును న్యాయస్థానం రిజర్వులో ఉంచింది. వీటిపై కూడా సోమవారం తీర్పును వెలువరించనుంది. 
 
ఇక, రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు, ఫైబర్ నెట్ కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో సోమవారం తీర్పు వెలువడనుంది. ఈ కేసుల్లో ఇటీవల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెల్సిందే.