శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 11 అక్టోబరు 2021 (13:17 IST)

ఓట్లు అభ్య‌ర్థించ లేకపోవ‌డ‌మే... ప్ర‌కాష్ రాజ్ అండ్ కో మైన‌స్ పాయింట్!

రాజకీయమనేది చదరంగం ఆటలాంటింది. ఎదుటివాడు పథకం వేసే లోపు చెక్ పెట్టేవాడే, ఇక్కడ నాయకుడు కాగ‌ల‌డు. ఆ ఆలోచనాశక్తి, చొరవ, నైపుణ్యం ఏమాత్రం లేక‌పోవ‌డం వ‌ల్లే సీనీ ఎన్నిక‌ల్లో చిరంజీవి కుటుంబం, ఆయ‌న మ‌ద్ద‌తు ఇచ్చిన వారు పిల్లిమొగ్గ‌లు వేశార‌ని సినీ విశ్లేష‌కులు భావిస్తున్నారు.  
 
ఫోన్ చేసో, కుదిరితే వ్యక్తిగతంగా కలిసో ఓట్లు అడుక్కోవాలి. ప్రధానమంత్రి నుంచి కార్మిక నాయకుడి దాకా ఎన్నికల్లో చేసే పని ఇదే. మనసుల్ని గెలుచున్నవాడే, ఓట్లను గెలుచుకోగలుగుతాడు. విష్ణు ఆ పని చేసాడు. మొగా స్టార్ చిరంజీవి స‌పోర్ట్ వెన‌క నుంచి  ప్రకాష్ రాజ్ ఆ ప‌ని చేయలేదు. 
 
ప్రకాష్ రాజ్ మొట్టమొదటి స్పీచులోనే డకౌట్ అయ్యాడు. కచ్చితంగా చిరంజీవి క్యాంపు ప్రమేయం లేకుండా ప్రకాష్ రాజ్ ఈ స్పీచు ఇవ్వడు. "మొత్తం సభ్యులు 900 కాదు. నేను లెక్కేసాను. 150 మంది యాక్టివ్ మెంబర్స్ కాదు. 175 మంది స్థానికంగా ఉండరు. షూటింగులకోసం వస్తారు, వెళ్తారు. వచ్చి ఓటేయరు. జెనీలియా మహారాష్ట్రా సీఎం కొడుకుని పెండ్లి చేసుకుని ఆమె బాగానే ఉంది. ఆమె రాదు. మిగతావాళ్లల్లో రాం చరణ్, నాగచైతన్య లాంటి వాళ్లకి అవసరం లేదు. వాళ్లు రారు. 200 మంది మెంబర్స్ ఆర్థికంగా బానే ఉన్నారు. అన్ని లెక్కలు పోగా మిగిలింది 250 మంది పేద మెంబర్లు. వాళ్లని ఆదుకోలేమా?అని ప్ర‌కాష్ రాజ్ మొద‌ట్లో మాట్లాడారు.  
 
ఇది ఎంత అమయాకత్వపు స్పీచో ఇట్టే తెలుస్తుంది. సింపుల్ గా ప్రత్యర్థులకి, తాము ఎవరి మీద కాన్సెట్రేట్ చెయ్యాలో చెప్పినట్టయ్యింది. వాళ్లదే చేసారు. జెనీలియాని తీసుకొచ్చి ఓటేయించారు. స్థానికేతరుల ఓట్లని పోస్టల్ బ్యాలెట్ ద్వారా లాక్కొచ్చేసారు. ధనిక మెంబరు,పేద మెంబరు అనే తేడా లేకుండా అందరికీ ఫోన్ చేసి మాట్లాడారు. అందరి మనసుల మీద కర్చీఫులు వేసేసారు. ఓటర్లు ఓట్లు గుద్దేసారు. 
 
మ‌రో పక్క "మా" ఎన్నికలు పెట్టుకుని పవన్ కల్యాణ్ "రిపబ్లిక్" ఈవెంటులో ఇచ్చిన స్పీచ్ ప్రకాష్ రాజ్ ఓటమికి పెద్ద గొయ్యి తవ్వింది. పంచ్ డైలాగ్స్ తో మార్కులు కొట్టెయ్యాలన్న ఊపులో ఏపీ మంత్రిని సన్నాసి అని తిట్టాడు పవన్. సీయంని కూడా నిందించాడు. "మా" మెంబర్సులో వైసీపీ సింపతైజర్స్ కూడా ఉంటార‌ని, వాళ్లని రాంగ్ సైడ్ ప‌ట్టించేలా చేయ‌డం ప‌వ‌న్ స్పీచ్ తో జ‌రిగిపోయింది. అది ప్రకాష్ రాజ్ కు దురదృష్టంగా మారింది. 
 
మొత్తానికి ప్రకాష్ రాజ్ ఓడిపోయాడు. మెగా బ్రదర్స్ ని నమ్ముకుంటే ఎవ్వడికైనా పట్టే గతి ఇదే అనిపించేలా చేసారు. ప్రోత్సహించి నిలబెట్టిన వాళ్లు చివరిదాకా వెన్నుదన్నుగా నిలబడాలి. అవతల మోహన్ బాబు తన కొడుకు గెలుపు కోసం అందరికీ ఫోన్లు చేస్తే ఇవతల చిరంజీవి మాత్రం ఎవ‌రికీ ఫోన్లు చేయ‌లేదు. నరేష్ కి ఆపోజిట్ గా మాట్లాడమని నాగబాబుని దింపారు. ఆయన కౌంటర్లు ఇవ్వగలడు కానీ తమ ఇమేజ్ తో అపోజిట్ ప్యానల్ ని బుల్డోజ్ చెయ్యలేడు. దానికి మెగాస్టారే సీన్లోకి రావాలి. ఆయన సైలెంటయిపోయి ప్రకాష్ రాజ్ పరువుతీయడమే కాకుండా తన "ఇండస్ట్రీకి పెద్ద దిక్కు" అనే టైటిల్ ని కూడా పోగొట్టుకున్నారు. తన మనిషిని 'మా' ప్రెసిడెంటుగా గెలిపించుకోలేనివాడు ఇండస్ట్రీ పెద్ద ఎలా అవుతాడు? 
 
చిరంజీవి సైలెన్స్ కి కారణం తెలియదు. మోహన్ బాబుతో మళ్లీ శత్రుత్వం ఎందుకని ఆగిపోయి ఉండొచ్చు. లేదా గెలిచేస్తామని విపరీతమైన నమ్మకమైనా అయ్యుండొచ్చు. ఈ రెండూ కాకపోతే ఎలాగూ ఓడిపోయున్నామనే సంకేతాలు అంది ఉండొచ్చు. అంతకంటే పెద్ద కారణాలు కనిపించట్లేదు. 
 
ఒకవేళ మొదటిది నిజమైతే ఆదిలోనే ప్రకాష్ రాజ్ ని తప్పుకోమని మంచు విష్ణుని ఏకగ్రీవంగా ఎన్నుకోమని అందరికీ పిలుపునివ్వాలి. ఆ పని చెయ్యలేదు కాబట్టి కారణం అది కాదు. మరి రెండో కారణమా అనుకుంటే అంతకు మించిన అమాయకత్వం ఇంకోటుండదు. కారణం మూడోదైతే మాత్రం అది పరమద్రోహం. నమ్ముకున్నవాడిని నట్టేట ముంచడమన్నమాట. 
 
తెలుగు సినీ పరిశ్రమ కమ్మ వర్గం నుంచి కాపు వర్గం చేతిలోకి వచ్చేసిందని, చిరంజీవిని "పెద్ద దిక్కు"గా పిలుచుకోవడమే దానికి తార్కాణమని అనుకున్నవారికి రీసౌండ్ వచ్చే విధంగా విష్ణు మంచు గెలుపు వినపడింది. అయితే ఈ గెలుపుకి కారణం కేవలం కేస్ట్ ఫీలింగ్ కాదు.  చిరంజీవి వర్గం వారి తెలివి తక్కువతనమే అని సినీ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. సమయానికి తగిన ఎత్తులు వేయలేకపోవడమే. ప్రతి విషయంలోనూ ఆదినుంచి ప్రత్యర్థికన్నా వెనకబడడమే. తమ గొయ్యి తాము తవ్వుకోవడమే జ‌రిగిందంటున్నారు. 
 
ప్రకాష్ రాజ్ ప్యానల్లో ఉన్న జీవిత 7 ఓట్ల తేడాతో ఓడిపోయింది. చిరంజీవి కుటుంబం నుంచి అల్లు అర్జున్, అల్లు శిరీష్ వంటి వాళ్లు కనీసం 8 మంది వచ్చినా ఆమె గెలిచేది. ఇంట్లో ఉన్న వాళ్లనే వీళ్లు ఓటేయడానికి తీసుకు రాలేకపోయారు. అవతలి ప్యానల్ వాళ్ళేమో జెనీలియాని, జయప్రదని బయటి నుంచి ఫ్లైటులో తీసుకురాగలిగారు. ఇద్దరికీ అంత తేడా ఉంది. అందుకే ప్ర‌కాష్ రాజ్ ఓట‌మి అనివార్య‌మైంది.