ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 జనవరి 2021 (08:31 IST)

తల్లి మాటలు విని దూరం పెట్టిందనీ.. ప్రేయసిని కత్తితో పొడిచి చంపేసిన ప్రేమోన్మాది!

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. తల్లి మాటలు విని తనను దూరం పెట్టడాన్ని జీర్ణించుకోలేక పోయాడు. ఈ క్రమంలో తన స్నేహితురాలితో కలిసి సరకులు కొనేందుకు వచ్చిన ప్రియురాలిని అడ్డుకుని, కత్తితో పొడిచి చంపేశాడు. ఈ దారుణం చిత్తూరు జిల్లా  పెనుమూరు మండలం తూర్పుపల్లెలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తూర్పుపల్లెకు చెందిన గాయత్రి (20), పూతలపట్టు మండలం చింతమాకులపల్లెకు చెందిన ఢిల్లీ బాబు (19) మధ్య డిగ్రీ చదువుతున్నప్పుడు ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఇది గత కొంతకాలంగా సాగుతూ వచ్చింది. 
 
అయితే, ఇద్దరి కులాలు వేరు కావడంతో తమ పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించరని భావించి గత నెలలో ఇంట్లో నుంచి పారిపోయి తిరుపతిలోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన గాయత్రి తండ్రి షణ్ముగ రెడ్డి తన కుమార్తె తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో వారిద్దరినీ గుర్తించిన పోలీసులు గ్రామానికి తీసుకొచ్చి కౌన్సెలింగ్ ఇచ్చి, తల్లిదండ్రుల వద్దకు పంపించారు. గాయత్రి కూడా తన ప్రియుడుని వదిలేసి తల్లిదండ్రులతో ఉండేందుకు సమ్మతించింది. 
 
దీన్ని ఢిల్లీ బాబు జీర్ణించుకోలేక పోయాడు. తల్లి మాటలు విన్న గాయత్రి తనను దూరం పెట్టిందన్న కసితో రగిలిపోయిన ఢిల్లీ బాబు ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. గాయత్రి మంగళవారం సరుకుల కోసం స్నేహితురాలితో కలిసి ద్విచక్రవాహనంపై పెనుమూరుకు వచ్చింది. విషయం తెలిసిన ఢిల్లీబాబు వారు తిరిగి వెళ్తున్న సమయంలో ఎంప్రాళ్లకొత్తూరు సమీపంలోని అటవీప్రాంతంలో అడ్డుకున్నాడు.
 
గాయత్రితో మాట్లాడేందుకు ప్రయత్నించగా, ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన యువకుడు వెంట తెచ్చుకున్న కత్తితో మొదట గొంతులో పొడిచాడు. ఆ కత్తి వంగిపోవడంతో మరో కత్తి తీసి పొట్టలో పదిసార్లు విచక్షణ రహితంగా పొడిచాడు. 
 
అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆమె స్నేహితురాలిని కూడా చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె తన ఫోన్ ద్వారా బంధువులకు విషయం చెప్పింది. అదే సమయంలో ఆ దారివెంట ఓ వ్యక్తి రావడంతో గమనించిన ఢిల్లీ బాబు అక్కడి నుంచి పరారయ్యాడు.
 
రక్తపుమడుగులో పడి కొట్టుమిట్టాడుతున్న బాధితురాలిని తొలుత పెనుమూరు పీహెచ్‌సీకి, ఆ తర్వాత వేలూరు సీఎంసీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషయం తెలిసిన బాధిత యువతి బంధువులు ఆగ్రహంతో నిందితుడి ఊరైన చింతమాకులపల్లె వెళ్లి ఇంటికి నిప్పు పెట్టారు. 
 
ఢిల్లీబాబు తండ్రిని బంధించి దాడిచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను శాంతింపజేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.