మంగళవారం, 7 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 24 సెప్టెంబరు 2025 (09:55 IST)

ఏపీ సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపించిన సీఐ శంకరయ్య

sankaraiah
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు పులివెందుల సీఐగా ఉన్న జె.శంకరయ్య లీగల్ నోటీసులు పంపించారు. మాజీ మంత్రి, వైకాపా నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినపుడు శంకరయ్య పులివెందుల సీఐగా ఉన్నారు. 
 
వివేకా హత్య కేసులో తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా దురుద్దేశపూరితంగా చంద్రబాబు పలుమార్లు తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ న్యాయవాది జి.ధరణేశ్వర రెడ్డి ద్వారా ఈ నెల 18న నోటీసులు పంపారు. అవి మంగళవారం వెలుగులోకి వచ్చాయి. అసెంబ్లీలో తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, తన ప్రతిష్టకు నష్టం కలిగించినందుకు రూ.1.45 కోట్ల పరిహారం చెల్లించాలని శంకరయ్య ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
 
2019 మార్చిలో వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు పులివెందుల సీఐగా ఉన్న జె శంకరయ్య సమక్షంలోనే నిందితులు ఆధారాలు ధ్వంసం చేశారని, రక్తపు మరకలు కడిగేశారని చంద్రబాబు పలుమార్లు ఆరోపించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ 2019లోనే శంకరయ్యను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 
 
'వివేకా హత్యపై కేసు నమోదు చేయక్కర్లేదంటూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నన్ను బెదిరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించొద్దని, మృతదేహంపై గాయాలున్నాయని ఎవరికీ చెప్పొద్దని నన్ను భయపెట్టారు' అని శంకరయ్య తొలుత సీబీఐకి వాంగ్మూలమిచ్చారు. 
 
అయితే మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం నమోదు చేయడానికి రాకుండా తనకు వేరే పనులున్నాయంటూ దాటవేశారు. ఆ తర్వాత వారం రోజుల్లోనే (2021 అక్టోబరు 6న) ఆయనపై సస్పెన్‌ను నాటి వైకాపా ప్రభుత్వం ఎత్తేసింది. నిందితులు ప్రభావితం చేయటం వల్లే శంకరయ్య మాట మార్చారని సీబీఐ న్యాయస్థానాల దృష్టికి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు శంకరయ్య ఏకంగా ముఖ్యమంత్రికే లీగల్ నోటీసులివ్వటం చర్చనీయాంశంగా మారింది. శంకరయ్య ప్రస్తుతం కర్నూలు రేంజ్‌లో వీఆర్‌లో ఉన్నారు.