గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 11 సెప్టెంబరు 2023 (15:20 IST)

చంద్రబాబుపై మరో కేసు నమోదు.. బెయిల్ వచ్చినా జైల్లో ఉంచేలా ప్లాన్..

chandrababu
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై ఏపీ సీఐడీ పోలీసులు మరో కేసును నమోదు చేశారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి 2022లో ఈ కేసు నమోదైంది. ఈ కేసులో చంద్రబాబును విచారణకు కోరుతూ సీఐడీ పీటీ వారెంట్ జారీ చేసే అవకాశం ఉంది. అలాగే, చంద్రబాబు హౌస్ అరెస్టుపై కౌంటర్ దాఖలు చేసేందుకు సిఐడీ నివేదికను సిద్ధం చేసింది. మరోవైపు, స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్ వచ్చినా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు కేసులో ఆయనను అరెస్టు చేసి జైల్లో ఉంచేలా సీఐడీ పోలీసులు ప్లాన్ చేశారు.
 
ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి సీఐడీ పోలీసులు గత 2022లో కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టులో ఇది వరకే వాదనలు పూర్తయ్యాయి. న్యాయస్థానం తీర్పును రిజర్వులో ఉంచింది. ఈ క్రమంలో తాజాగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించారు. అందువల్ల ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోనూ మాజీ సీఎంను విచారించేందుకు అనుమతి కోరనున్నారని తెలుస్తుంది. 
 
ఇదిలావుండగా, చంద్రబాబును హౌస్ అరెస్టు‌కు అవకాశమివ్వాలన్న పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతుంది. ఈ పిటిషన్‌పై లంచ్ సమయంలో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి సీఐడీని ఆదేశించారు. దీంతో సీఐడీ కౌంటర్‌ను సిద్ధం చేసింది. మాజీ సీఎం భద్రతకు సంబంధించి జైలులో ఎలాంటి ఢోకా లేదని, బెస్ట్ సెక్యూరిటీని ఉంటుందని, చంద్రబాబును అక్కడ ఉంచడమే మంచిదని సీఐడీ కోర్టుకు దృష్టికి తీసుకెళ్లనుంది.