శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 20 నవంబరు 2017 (12:41 IST)

మగవారిని చంపడమే లక్ష్యంగా చంద్రబాబు : ఆర్కే. రోజా

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పురుషులను చంపడమే చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోందని మండిపడ్డారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పురుషులను చంపడమే చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోందని మండిపడ్డారు. జగన్ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కర్నూలు జిల్లాలో జరిగిన 'మహిళా గర్జన' సదస్సుకు హాజరై ప్రసంగించిన రోజా, ఏపీ ప్రభుత్వ మద్యం విధానాన్ని తూర్పారబట్టారు. జాతీయ రహదారులపై మద్యం దుకాణాలు వద్దని సుప్రీంకోర్టు ఆదేశిస్తే, తమ రహదార్లు జాతీయ రహదారులే కాదని, ఎన్నో ప్రధాన రోడ్లను ఒక్క జీవోతో డీ నోటిఫై చేసిన ఘనత చంద్రబాబు సర్కారుదేనని నిప్పులు చెరిగారు. 
 
జాతీయ రహదారులను లోకల్ రోడ్లుగా మార్చి ఇబ్బడిముబ్బడిగా వైన్స్, బార్లను తెరిపించాడని, ఆడవాళ్ల జీవితాలతో చంద్రబాబు చెలగాటం ఆడుతున్నాడని, అలాంటి వారికి బుద్ధి చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. జగనన్న ముఖ్యమంత్రి అయితేనే ఆడవాళ్ల కష్టాలు తీరుతాయని, జగనన్న మాటిస్తే, రాజన్న మాటిచ్చినట్టేనని, వైకాపా ప్రభుత్వం వస్తే, మద్య నిషేధం జరిగి తీరుతుందని రోజా హామీ ఇచ్చారు.