మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , సోమవారం, 22 నవంబరు 2021 (13:35 IST)

వ‌ర‌ద బాధితుల‌కు 25 కేజీల బియ్యం, 2వేల న‌గ‌దు, ప‌ప్పు, ఉప్పులు...

ఏపీలో వివిధ జిల్లాల‌లో వరద సహాయక చర్యలపై అసెంబ్లీ చాంబర్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. భారీ వర్షాల కారణంగా ఏపీలోని పలు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. సీఎం వరద సహాయక చర్యలపై అసెంబ్లీ చాంబర్‌లో కలెక్టర్లు, అధికారులతో మాట్లాడారు. సమీక్షలో సీఎం జగన్‌ మాట్లాడుతూ, వరద బాధితుల పట్ల ఉదారంగా వ్య‌వ‌హ‌రించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. వారి పట్ల మానవతా దృక్పథాన్ని చూపించండి, తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఉదారత చూపించండి అని చెప్పారు.
 
 
బాధితుల‌కు 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ వంట నూనె, కేజీ ఉల్లి, కేజీ బంగాళాదుంప‌,  రూ.2 వేలు న‌గ‌దు ఇవ్వాల‌ని సూచించారు. ప్ర‌తి గ్రామాన్ని, వార్డును యూనిట్‌గా తీసుకోవాల‌ని, వాలంటీర్ల సేవలను వినియోగించుకుని ప్రతి ఇంటికీ సహాయం అందాల‌న్నారు. ముంపునకు గురైన ప్రతి ఇంటికీ ఈ పరిహారం అందాల‌ని, ఎవ్వరికీ అందలేదన్న మాట రాకూడద‌ని చెప్పారు. సహాయక శిబిరాల్లో ఉన్న వారికి మంచి వసతులు, సదుపాయాలు కల్పించాల‌ని, ప్రభుత్వం బాగా చూసుకుందనే మాట వినిపించాల‌ని అధికారుల‌కు సీఎం సూచించారు. 
 
 
వారు తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు కుటుంబానికి రూ.2వేలు ఇవ్వాల‌ని, విద్యుత్‌పునరుద్ధరణ, రక్షిత తాగునీటిని అందించడం యుద్ధ ప్రాతిపదికన చేయాలి, దీనికిమీద ప్రత్యేక దృషిపెట్టాల‌న్నారు. 104 కాల్‌సెంటర్‌ ఇప్పటికే ప్రజలందరికీ పరిచయం ఉంద‌ని, ఏ ఇబ్బంది ఉన్నా, ఈ నంబర్‌కు సమాచారం ఇవ్వమని చెప్పండ‌న్నారు. అలాగే, రోడ్లను పునరుద్ధరించడంపై దృష్టిపెట్టాల‌ని, రవాణా సాగేలా ముందు తాత్కాలిక పనులు వెంటనే చేయాల‌న్నారు. శాశ్వతంగా చేయాల్సిన పనులపై కార్యాచరణ రూపొందించాల‌ని, వచ్చిన వరదను దృష్టిలో ఉంచుకుని, ఆ మేరకు డిజైన్లు రూపొందించి శాశ్వత పనులు చేపట్టాల‌న్నారు. వచ్చే నాలుగు వారాల్లో టెండర్లను ఖరారుచేసి.. పనులు మొదలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాల‌ని సీఎం చెప్పారు. 
 
 
ఇళ్లు కూలిపోయినా, పాక్షికంగా దెబ్బతిన్నా వారికి వెంటనే నగదు ఇవ్వాల‌ని, పూర్తిగా ఇళ్లు ధ్వంసం అయితే, రూ. 95,100 డబ్బు ఇవ్వాల‌న్నారు. దీంతోపాటు ఇళ్లు కోల్పోయిన వారికి కొత్త ఇల్లు వెంటనే మంజూరు చేయాల‌న్నారు. పాక్షికంగా నష్టం వాటిల్లిన ఇంటికి రూ. 5200 నగదు వెంటనే అందించేలా చూడాల‌న్నారు. ప్రాణాలు కోల్పోయిన వారికి ఇప్పటికే 90 శాతం మేర నష్టపరిహారం అందించామ‌ని, చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు తోడుగా నిలవాల‌ని సూచించారు. 

 
నెల్లూరులో చనిపోయిన కానిస్టేబుల్‌కుటుంబానికి, గ్రామ సచివాలయ ఉద్యోగి కుటుంబానికి, ఆర్టీసీ కండక్టర్‌ కుటుంబానికి తోడుగా ఉండాల‌ని, వారికి వెంటనే సహాయం అందేలా చర్యలు తీసుకోవాల‌న్నారు. రూ.25 లక్షల పరిహారం వారి కుటుంబాలకు అందించాల‌ని, విపత్తులో సహాయం చేస్తూ ప్రాణాలు కోల్పోయారు కాబట్టి, మిగిలిన వారిలో ధైర్యం నింపాడానికే ఈ చర్యలన్నారు. వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వల‌ని ఆదేష‌శించారు. పంటల నష్టం ఎన్యుమరేషన్‌ మొదలుపెట్టాల‌ని, విత్తనాలు 80శాతం సబ్సిడీపై సరఫరా చేయాల‌ని చెప్పారు. 

 
బంగాళాఖాతంలో మళ్లీ వస్తున్న అల్పపీడనం తమిళనాడు దక్షిణ ప్రాంతానికి వెళ్తున్నట్టు చెప్తున్నార‌ని,  అయినా సరే చాలా అప్రమత్తంగా ఉండాల‌ని సూచించారు. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు సహాయ కార్యక్రమాల కోసం మరో రూ.10 కోట్లు చొప్పున మొత్తంగా రూ.40 కోట్లను వెంటనే ఇస్తున్నామ‌ని సీఎం జ‌గ‌న్ వెల్ల‌డించారు.