1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 29 ఏప్రియల్ 2021 (22:11 IST)

కోవిడ్‌ ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్య పెంచండి : సీఎం జగన్ ఆదేశం

రాష్ట్రంలో కోవిడ్‌ చికిత్సకు ఎక్కడా బెడ్ల కొరత ఉండకుండా చూడాలి. ఆ మేరకు ఆస్పత్రులలో బెడ్ల సంఖ్య పెంచాల‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. కోవిడ్‌-19 నియంత్రణ, నివారణపై సీఎం వైయస్‌ జగన్ గురువారం సమీక్ష నిర్వ‌హించారు. 
 
ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ... ప్ర‌తి జిల్లాలోని కోవిడ్‌ కేర్‌ సెంటర్ల (సీసీసీ)లో తప్పనిసరిగా 3 వేల బెడ్లు ఉండాలి. వాటిలో ఆక్సీజన్‌ బెడ్లు తప్పనిసరిగా 1000, నాన్‌ ఆక్సీజన్‌ బెడ్లు 2 వేలు ఉండాలి. కోవిడ్‌ చికిత్సకు ఇప్పుడు ఇస్తున్న రేట్లు పెంచండి. ప్రభుత్వ జాబితా (ఎంప్యానెల్‌)లో ఉన్న ప్రైవేటు ఆస్పత్రులలో కోవిడ్‌ చికిత్సకు వెంటనే రేట్లు పెంచండి. అవే రేట్లను కోవిడ్‌ చికిత్స చేస్తున్న ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల (ఎంప్యానెల్‌)కు కూడా వర్తింప చేయండి. ఏ ఆస్పత్రి (ప్రభుత్వ ఎంప్యానెల్‌)లో కూడా కోవిడ్‌ చికిత్సకు నిరాకరించకుండా చూడండి. 
 
కోవిడ్‌ ఆస్పత్రులలో పని చేస్తున్న ఎఫ్‌ఎన్‌ఓ, ఎంఎన్‌ఓల జీతాలు కూడా పెంచండి. రోగులకు వైద్య సేవల్లో ఎక్కడా ఏ ఇబ్బంది రాకూడదు. రాష్ట్రంలోని అన్ని కోవిడ్‌ ఆస్పత్రులలో అవసరమైన వైద్యులు, నర్సులు, పారా మెడికల్‌ సిబ్బందిని వెంటనే నియమించండి. సిబ్బంది లేకపోవడం వల్ల ఏ ఆస్పత్రిలో కూడా వైద్య సేవలకు అంతరాయం కలగొద్దు. కోవిడ్‌ చికిత్సలో కీలకమై ఆక్సీజన్‌ తగినంత ఉండేలా అవసరమైన చోట్ల  42 పీఎస్‌ఏ (ప్రెజర్‌ స్వింగ్‌ అబ్జార్ప్సన్‌) ప్లాంట్లు ఏర్పాటు చేయండి. 
 
అదేవిధంగా ఆక్సీజన్‌ ట్యాంకర్లు కొనుగోలు చేసి, టీచింగ్‌ ఆస్పత్రులతో పాటు, ఇతర ఆస్పత్రుల వద్ద వాటిని ఏర్పాటు చేయండి. టీచింగ్‌ ఆస్పత్రుల వద్ద 10 కెఎల్‌ సామర్థ్యం, ఇతర ఆస్పత్రుల వద్ద 1 కెఎల్‌ సామర్థ్యంతో కూడిన ఆక్సీజన్‌ ట్యాంకర్లు ఏర్పాటు చేయండి. వీలైనంత త్వరగా ఇవన్నీ ఏర్పాటయ్యేలా చర్యలు చేపట్టండి. కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం 422 కోవిడ్‌ ఆస్పత్రుల(ప్రభుత్వ, ప్రైవేటు)లో 35,644 బెడ్లు ఉండగా, వాటిలో 21590 ఆక్యుపైడ్‌ అని సమావేశంలో అధికారులు వెల్లడించారు. 
 
దాదాపు 79 వేలు మంది హోం ఐసొలేషన్‌లోనూ, మరో 6,348 మంది కోవిడ్‌ కేర్‌ సెంటర్లలోనూ ఉన్నారని, 14,862 మంది రోగులు ఆక్సీజన్‌ బెడ్లపై చికిత్స పొందుతున్నారని, గత 24 గంటల్లో 14 వేల కేసులు కొత్తగా వచ్చాయని అధికారులు తెలిపారు. సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌తో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు.