గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 16 నవంబరు 2021 (13:35 IST)

ర‌హ‌దారిపై ఒక్క గుంత క‌నిపించొద్దు... సగం స‌గం ప‌నులొద్దు!

రాష్ట్రంలో రోడ్ల మరమ్మతుల పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని, రహదారులపై ఎక్కడా ఒక్క గుంత కూడా కనిపించొద్దని ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, పురపాలక శాఖల పరిధిలోని రహదారులపై ఏర్పడిన గుంతలను పూడ్చి వాటిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని ఆయా శాఖలను ఆదేశించారు. 
 
 
న్యూ డెవల్‌పమెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డీబీ) ప్రాజెక్టుల్లో పనులు దక్కించుకుని పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్‌లి్‌స్టలో పెట్టాలని సూచించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రహదారుల మరమ్మతులు, పునరుద్ధరణపై సీఎం జగన్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెలాఖరుకల్లా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని, వచ్చేఏడాది జూన్‌ నాటకి పనులు పూర్తికావాలని ఆదేశించారు. 
 
 
రోడ్ల మరమ్మత్తులు వెంటనే చేపట్టాలి. ఏదో సగం సగం పనులు చేసి వదిలేశారన్న విమర్శ రానీయొద్దు. ప్రమాణాల మేరకు రహదారులు అభివృద్ధి చేయాలి.. రోడ్ల పరిస్థితిపై రిపేరుకు ముందు, తర్వాత ఫోటోలు తీయాలి అన్నారు. రాష్ట్రంలో 8వేల కిలోమీటర్ల మేర రహదారులను అభివృద్ధి చేసే పనులను 1,120 వర్క్‌లుగా విభజించారు. కాగా.. కొన్నిచోట్ల ఇప్పటికే వర్క్‌లు చేపట్టామని, కోస్తా జిల్లాల్లో వర్షాల కారణంగా పనులు ఆలస్యమవుతున్నాయని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. వర్షాలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు. ఎన్‌డీబీ నిధులతో చేపట్టే రహదారులపై కూడా సీఎం సమీక్షించారు. 
 
 
కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదన్న అంశాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో పనులు చేయని కాంట్రాక్టర్లను అవసరమైతే బ్లాక్‌లిస్టులో పెట్టాలని, నోటీసులివ్వాలని సీఎం ఆదేశించారు. వచ్చే నెలలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రం ఇప్పటికే ప్రతిపాదించిన ప్రాజెక్టులు, కొత్తగా చేపట్టాల్సిన వాటిపై నివేదికలు సిద్ధం చేయాలని ఆర్‌అండ్‌బీని సీఎం ఆదేశించారు. కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి బొత్స, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఆర్‌అండ్‌బీ, పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.