శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 మార్చి 2022 (09:21 IST)

మహిళల భద్రత కోసం ప్రభుత్వం ముందడుగు.. ఫోర్ వీలర్స్ వచ్చేస్తున్నాయ్

మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేయనుంది. ఇప్పటికే దిశ యాప్ దిశ పోలీస్ స్టేషన్లతో వారికి రక్షణ కల్పిస్తున్న ప్రభుత్వం.. దిశ ఫోర్ వీలర్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. 

తాజాగా ఫోర్ వీలర్ వాహనాలను కూడా అందించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మొత్తం 163 వాహనాలను సీఎం జగన్ బుధవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు.
 
ఈ వాహనాలన్ని జిల్లా యూనిట్ కంట్రోల్ రూం నుండి నేరుగా ప్రత్యక్ష పర్యవేక్షణకు అనుగుణంగా ప్రత్యేక GPS ట్రాకింగ్ వ్యవస్థతో కూడి ఉంటుంది. మహిళలు, పిల్లలపై జరిగే నేరాలను అరికట్టడానికి ఈ పెట్రోలింగ్ వాహనాలు జనసంచారం తక్కువ ఉన్న సమస్యాత్మక ప్రాంతాలలో నేరం జరిగేందుకు అవకాశం ఉన్న అన్ని ప్రదేశాలలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తాయి.
 
ప్రస్తుతం ఉన్న 900 ద్విచక్ర వాహనాలు, 163 ఫోర్ వీలర్ దిశ పెట్రోలింగ్ వాహనాలతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో పౌరులకు సత్వర ప్రతిస్పందన కోసం 3,000కు పైగా ఎమర్జెన్సీ వాహనాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 18 పోలీస్ యూనిట్లలో ఏర్పాటు చేసిన దిశ కంట్రోల్ రూంతో పాటు పోలీస్ ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్ రూంకి అనుసంధానించినట్లు ప్రభుత్వం తెలిపింది.