బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 17 సెప్టెంబరు 2020 (07:16 IST)

పరిహారం ఇస్తాం రండి.. వైసీపీ నేతలకు నకిలీ లేఖలు

ఏపీలో అధికార పార్టీ నేతలకే టోకరా వేసేందుకు ప్లాన్ రూపొందించారు కొంతమంది. అయితే ఆ నేతలు ముందే మేల్కొనడంతో అసలు గుట్టు రట్టయింది. నెల్లూరు జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంతకీ విషయమేంటంటే...

చెన్నై-వైజాగ్‌ కోస్టల్‌ కారిడార్‌ను జాతీయ రహదారికి అనుసంధానం చేయనున్నారని, ఇందుకు సంబంధించి సేకరించే భూములకు ఎకరాకు రూ.25 లక్షలు పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ కాగితాలపూరుకు చెందిన  వైసీపీ నాయకులు  చేవూరు వెంకటేశ్వర్లు, గుమ్మా రవీంద్ర, గడ్డం రాజేష్‌కు ఉత్తరాలు వచ్చాయి.

2021లో సాగరమాల పేరుతో ఈ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్న విషయాన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచిందని, ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెంది పార్టీకి సహకరిస్తారన్న ఆలోచనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వాటిలో సూచించారు.

కోస్టల్‌ కారిడార్‌ కాలువ ఆనుకుని ఉన్న గ్రామాల్లోని ముఖ్య నాయకులకు మాత్రమే ఈ విషయాన్ని తెలుపుతున్నామంటూ సంతకం, కింద వైసీపీ కార్యాలయం అని ఉత్తరాల్లో ఉంది. దీంతో అవాక్కైన ఆ నాయకులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే కాకాణి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వాటిని పరిశీలించి ఇవి నకిలీ ఉత్తరాలని తేల్చేశారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.