బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 6 ఆగస్టు 2020 (07:42 IST)

రాజధానుల నిర్ణయం సరైనదైతే ఎన్నికలకు రండి: టీడీపీ

దేశంలో ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత, రాజధాని ఇది అని నిర్ణయించిన తర్వాత మార్చడం ఎప్పుడైనా, ఎక్కడైనా జరిగిందా? ప్రజల అభీష్టానికి విరుద్ధంగా మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి.. ప్రజల వద్దకు వెళ్లి రెఫరెండం తీసుకోవడానికి ఎందుకు భయపడుతున్నారు? అని ఏపీ టీడీపీ అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు నిలదీశారు. 
 
ఆయన విలేఖరులతో మాట్లాడుతూ..."151 సీట్లు వచ్చాయి, ఎదురులేని ప్రజా బలం ఉందని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏ కలుగులో దాక్కున్నారు.? ఏ ప్యాలస్ లో పబ్జీ ఆడుకుంటున్నారు.? మూడు రాజధానుల నిర్ణయం సరైనదేనని  జగన్మోహన్ రెడ్డి భావిస్తే.. వెంటనే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్దాం రండి. అభివృద్ధి కోసమే పాలనా వికేంద్రీకరణ అంటున్న ముఖ్యమంత్రి ప్రజాభిప్రాయం తీసుకుందామంటే ఎందుకు వెనకాడుతున్నారో సమాధానం చెప్పాలి.

మొన్నటి ఎన్నికల్లో మీ గెలుపునకు ప్రజల ఓట్లే కారణమని నిరూపించుకుని గెలుపుపై చిత్తశుద్ధిని చాటుకోండి. 
మాట తప్పితే రాజీనామా చేసే రకమైన విలువలు రాజకీయాల్లో ఉండాలని ఎన్నికల ముందు ప్రకటించారు. నాటి మీ ప్రకటన మేరకు అమరావతిపై మాట తప్పి ప్రజల్ని మోసం చేసిన ముఖ్యమంత్రి ఎప్పుడు రాజీనామా చేస్తున్నారు.?

అమరావతే రాజధానిగా ఉంటుందని నాడు హామీలిచ్చి నేడు మాట మార్చిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎప్పుడు రాజీనామా చేస్తున్నారు.? రాజధాని అమరావతికి అసెంబ్లీ సాక్షిగా మద్దతిచ్చి నేడు విశాఖలో కబ్జా చేసిన భూముల కోసం మూడు రాజధానులు అంటున్న ముఖ్యమంత్రి గారూ ఇవేనా చెప్పిన రాజకీయ విలువలు.?

నియంతృత్వ వైఖరితో తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేకే.. ప్రజలకు ముఖం చాటేస్తున్నానని ముఖ్యమంత్రి ఒప్పుకోవాలి. మాట తప్పను.. మడమ తిప్పను అనే మాటతో ప్రజల్ని మాయ చేసి అధికారంలోకి వచ్చి మాట తప్పినందుకు ముఖ్యమంత్రి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి.

లేకుంటే ప్రజా ఉద్యమం తప్పదని గుర్తుంచుకోండి. చంద్రబాబు నాయుడు సవాల్ స్వీకరించి అసెంబ్లీని రద్దు చేయండి. మీ మూడు రాజధానుల నిర్ణయం సరైనదేనని ప్రజలు అంగీకరించి మీకు మళ్లీ అధికారం ఇస్తే మేం ఇంకేం మాట్లాడం. లేని పక్షంలో న్యాయపోరాటం కొనసాగుతుందని గుర్తుంచుకోండి" అని హెచ్చరించారు.