నేటి కౌరవసభలో న్యాయదేవతకు వస్త్రాపహరణం : ఆర్ఆర్ఆర్

raghuramakrishnam raju
ఠాగూర్| Last Updated: మంగళవారం, 13 అక్టోబరు 2020 (16:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వంపై వైకాపా అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణంరాజు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆనాటి కౌరవసభలో ద్రౌపది వస్త్రాపహరణం జరిగిందని... నేటి కౌరవసభలో న్యాయదేవతకు వస్త్రాపహరణం జరుగుతోందని చెప్పారు.

ఇలాంటి కౌరవసభలో తాను కూడా ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని అన్నారు. ఆనాడు ద్రౌపదిని గోవిందుడు కాపాడాడని... ఈరోజు న్యాయవ్యవస్థను కోవిందుడు (రాష్ట్రపతి) కాపాడతారని చెప్పారు.

న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. న్యాయమూర్తులకు ఉద్దేశాలను ఆపాదించరాదని రాజ్యాంగం స్పష్టంగా చెపుతున్నప్పటికీ... ఏపీలో దాడులు ఆగడం లేదని చెప్పారు.

కోర్టులను దూషించిన వారిలో నందిగం సురేష్, ఆమంచి కృష్ణమోహన్‌తో పాటు పలువురు రెడ్ల పేర్లు ఉన్నాయని తెలిపారు. సోషల్ మీడియా వేదికగా దూషించిన వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

వైసీపీ నేతలకు ఇబ్బంది కలిగేలా ఎవరైనా ప్రవర్తిస్తే మాత్రం క్షణాల్లో కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేని నిస్సహాయ, చేతకాని సీబీసీఐడీ రాష్ట్రంలో ఉందని అన్నారు.

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాంగ, చట్టవ్యతిరేక చర్యలను చూస్తుంటే రాష్ట్రంలో త్వరలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన జోస్యం చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తోందని.. ఇప్పుడు న్యాయవ్యవస్థను కూడా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. సీఎం తన కేసుల నుంచి తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారన్నారు.

దీంతో రాష్ట్రంలో పాలన విధ్వంసమై, రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతోందన్నారు. ఈ పరిస్థితులు ఖచ్చితంగా ఆర్టికల్‌ 356 మేరకు రాష్ట్రపతి పాలన దిశగా దారి తీస్తాయని హెచ్చరించారు. అమరావతి ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తం చేయాలని పిలుపునిచ్చారు.దీనిపై మరింత చదవండి :