మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (15:42 IST)

గన్నవరం టీడీపీ ఆఫీసులో పోలీస్ కానిస్టేబుల్ చేతివాటం..

police constable theft
ఏపీలోని గన్నవరం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వైకాపా నేతలు, కార్యకర్తలు దాడి చేసి ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. వీరిని అదుపు చేసేందుకు వెళ్లిన పోలీసులు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. కార్యాలయంలోని ఇయర్ బడ్స్‌ను ఓ కానిస్టేబుల్ దొంగిలించాడు. దీనికి సంబధించిన వీడియోను టీడీపీ నేతలు సోషల్ మీడియాలో రిలీజ్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
రెండు రోజుల క్రితం టీడీపీ కార్యాలయంలో వైకాపా శ్రేణులు దాడి చేసి విధ్వంసం సృష్టించాయి. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులుగా చెప్పుకునే కొందరు నేతలు ఈ దాడికి పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆఫీసులో ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఈ దాడితో గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో టీడీపీ ఆఫీసు ముందు భారీ పోలీస్ భద్రతను ఏర్పాటుచేశారు. 
 
ఇదిలావుంటే, దాడి చేసే సమయంలో ఆ కార్యాలయంలోకి వెళ్లిన ఓ కానిస్టేబుల్ తన చేతివాటాన్ని చూపించాడు. ఆఫీసులోకి వెళ్ళిన ఓ కానిస్టేబుల్ విలువైన వస్తువుల కోసం వెతుకులాట మొదలుపెట్టాడు. టేబుల్ సొరుగులో ఇయర్ బడ్స్ కనబడటంతో వాటిని పరిశీలిస్తున్నట్టుగా నటిస్తూ, గుట్టుచప్పుడు కాకుండా వాటిని తన ఫ్యాంటు వెనుక జేబులో వేసుకున్నాడు. ఆపై ఏమీ ఎరుగనట్టుగా బయటకు వచ్చాడు. అయితే, ఆఫీసులో అమర్చిన సీసీటీవీ టీవీల్లో ఆ కానిస్టేబుల్ నిర్వాకం బయటపడింది. దీన్ని టీడీపీ నేతలు బహిర్గతం చేశారు.